- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్‌లో ఇంధన కల్లోలం.. ఏక్షణమైనా పెట్రోల్ పంపులు బంద్
బంగ్లాదేశ్ లో తీవ్ర ఇంధన సంక్షోభంతో ఏ క్షణమైనా పెట్రోల్ బంకులు మూసివేసే పరిస్థితి ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. మార్చి 24 నాటికి బంగ్లాదేశ్‌లో పరిస్థితి అత్యంత భీకరంగా మారింది. తన ఇంధన అవసరాల కోసం 95% పైగా మధ్య ప్రాచ్య దేశాలపైనే ఆధారపడే బంగ్లాదేశ్‌కు, హర్మూజ్ జలసంధి మూసివేత శరాఘాతంగా మారింది. రాజధాని ఢాకా సహా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. సరఫరా లేక అనేక స్టేషన్లు ఇప్పటికే బోర్డులు తిప్పేయగా, అందుబాటులో ఉన్న కొద్దిపాటి డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈద్ పండగ సమయం కావడంతో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఇంధనం కోసం ఎగబడటం(Panic Buying), పరిస్థితిని మరింత దిగజారింది.
రేషన్ పద్దతిలో పెట్రోల్, డీజిల్
అయితే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రేషనింగ్ పద్ధతిని అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం కార్లకు కేవలం 10 లీటర్లు, మోటార్ సైకిళ్లకు 2 లీటర్లు మాత్రమే పోయాలని నిబంధన విధించారు. ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు విశ్వవిద్యాలయాలకు, విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు. దేశీయంగా నిల్వలు అట్టడుగుకు చేరడంతో, అత్యవసరంగా భారతదేశం నుండి డీజిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా అందుతున్న ఈ సాయం కొంత ఊరటనిస్తున్నప్పటికీ, మొత్తం దేశ అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోవడం లేదు.
ఏ క్షణమైనా బంకులు బంద్
బంగ్లాదేశ్ పెట్రోల్ పంప్ యజమానుల సంఘం హెచ్చరించినట్లుగా, ఏ క్షణమైనా పంపులు పూర్తిగా బంద్ అయ్యే ప్రమాదం ఉంది. సరఫరా తక్కువగా ఉండటంతోపాటు ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో పంపుల వద్ద భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 150 డాలర్లు దాటడం, షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






