స్క్రాప్ డీలర్ నుంచి మెటల్ కింగ్ వరకు.. అనిల్ అగర్వాల్ గురించి మీకు తెలుసా..?

by Malleboina Mahesh |

ఏమీ లేని స్థాయి నుండి ఏడు ఖండాల్లో వేదాంత సామ్రాజ్యాన్ని స్థాపించిన అనిల్ అగర్వాల్ ప్రయాణం అద్భుతం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం.

స్క్రాప్ డీలర్ నుంచి మెటల్ కింగ్ వరకు.. అనిల్ అగర్వాల్ గురించి మీకు తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో స్క్రాప్ డీలర్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుత సమాజంలో మెటల్ కింగ్ (Metal King) స్థాయికి ఎదిగి తన భారీ విజయాన్ని యువతకు నిదర్శనంగా మారారు. నేటి సమాజంలో కింది స్థాయి నుంచి ఎదిగి బిలియనీర్ స్థాయికి ఎదిగిన అనిల్ అగర్వాల్ (Anil Agarwal) ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. 1954లో బీహార్‌లోని పాట్నాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, 19 ఏళ్ల వయసులో కేవలం ఒక టిఫిన్ బాక్స్, కొన్ని కలలతో ముంబైలో అడుగుపెట్టారు. తొలినాళ్లలో పాత సామాన్లు (స్క్రాప్) సేకరించే వ్యాపారం చేస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

తాను ప్రారంభించిన మొదటి 10 వ్యాపారాలలో 9 ఘోరంగా విఫలమైనప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి పదో ప్రయత్నంలో విజయం సాధించి, నేడు రూ. 42,000 కోట్ల భారీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1986లో స్టెర్లైట్ ఇండస్ట్రీస్ (Sterlite Industries) స్థాపనతో ఆయన ప్రస్థానం మలుపు తిరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన బాల్కో (BALCO), హిందుస్థాన్ జింక్ వంటి వాటిలో వాటాలను దక్కించుకుంటూ లోహ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2003లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వేదాంత రిసోర్సెస్‌ను లిస్ట్ చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

కేవలం సంపద సృష్టించడమే కాకుండా, తన సంపాదనలో అధిక భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఆయన నిజమైన హీరోగా నిలుస్తున్నారు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ప్రయత్నిస్తే ఆకాశమే హద్దు అని అనిల్ అగర్వాల్ నిరూపించారు. వరుసగా 9 ప్రయత్నాల తర్వాత పదో ప్రయత్నంలో సఫలం అయిన ఆయన జీవిత చరిత్ర నేటి యువతకు ప్రేరణ గా నిలుస్తుంది.

Next Story