- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ వాటర్ బిల్లుల పేరుతో భారీ దోపిడీ.. సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక!
వాటర్ బిల్లు బకాయి పేరుతో సైబర్ మోసాలు! ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుంది. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నగరవాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాటర్ బిల్లుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. "మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం" అంటూ వాటర్ బోర్డు (HMWSSB) అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల బిల్లు అప్‌డేట్ పేరుతో HMWSSB WATER BILL UPDATE.apk అనే ప్రమాదకరమైన లింక్‌ను పంపి, దానిని ఇన్‌స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని, వారు మీ కాల్స్‌ను డైవర్ట్ చేయడమే కాకుండా బ్యాంక్ ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు.
జాగ్రత్తగా ఉండండి - ఇలా ఫిర్యాదు చేయండి
పైన తెలిపినటువంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఫైళ్లను పొరపాటున కూడా ఇన్‌స్టాల్ చేయవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. నీటి బిల్లులను కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే చెల్లించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ కోరారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని, cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని నగరవాసులను సజ్జనార్ అప్రమత్తం చేశారు.






