యూరియా యాప్ రద్దు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.

యూరియా యాప్ రద్దు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
X

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పాత బస్టాండ్ పరిసరాల్లో ఆందోళన నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నా కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌కు చెందిన సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముందాం నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, చందాపూర్ గ్రామ సర్పంచ్ మంగారెడ్డి తదితరులు పెట్రోల్ బాటిళ్లతో పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కపిల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే సురేందర్ అరెస్ట్..

ఇదిలా ఉండగా, ధర్నాలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై పాత బస్టాండ్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాడ్వాయి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.

Next Story