ఓటరు జాబితా సవరణకు జిల్లాలోని ప్రతి ఒక్కరు సహకరించాలి

by velandi.Saikiran |

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో నమోదు చేస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారధ అన్నారు.

ఓటరు జాబితా సవరణకు జిల్లాలోని ప్రతి ఒక్కరు సహకరించాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో నమోదు చేస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారధ అన్నారు. వరంగల్ కలెక్టరేట్ లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఓటరు సవరణ జాబితాను చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహిస్తారని ఆమె తెలిపారు. ఈ సర్వే ద్వారా పోలింగ్ కేంద్రాల హేతుభద్రీకరణ చేయడంతో పాటు 1200లోపు ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా చూస్తారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వేకు వచ్చే బీఎల్ఓలు, బీఎల్ఏలకు తగిన సహకారం అందించాలని ఆమె కోరారు. ఇంటింటి సర్వేలో సమగ్ర వివరాలు తీసుకొని హేతుభద్రీకరణ చేస్తారని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తారని అన్నారు.

పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పుల సవరణ లు ఏమైనా ఉంటే నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో గుర్తింపు కార్డులను చూపించాలన్నారు. ఆధార్ గుర్తింపు కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒక కార్డును చూపించాలన్నారు. బీఎల్ఓలు ఇంటిని సందర్శించిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా, మూసి ఉన్నా ఎన్యుమరేషన్ ఫారాలను వారి ఇంటిలో వేసి కనీసం మూడు సార్లు ఇంటికి వచ్చి పరిశీలించి వెళ్తారని అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలలో వివరాలన్నింటిని అందించాలన్నారు. ఓటరుకు ఇప్పటికే ఓటరు ఐడీ కార్డు ఉన్నట్లయితే దాని వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, వివరాలు అందించాలన్నారు. తల్లిదండ్రులు ప్రస్తుతం జీవించి లేకుంటే గతంలో ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నారో ఆ వివరాలను సేకరిస్తారని అన్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఓటరుగా నమోదైతే అనవసరమైనవి తొలగిస్తారని ఆమె తెలిపారు. వరంగల్ జిల్లా పరిధిలో నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్దన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితాను చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ జిల్లాలో మొత్తం 795 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు.

ఈ కేంద్రాల కోసం బీఎల్ఓలను నియమించడంతో పాటు కొత్తగా రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవల్ అసిస్టెంట్లను కూడా నియామకం చేస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలో మొత్తం 780309 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈనెల రోజులకు పైగా నడిచే ఈ ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31, 2026 నాడు ముద్రిస్తారని అన్నారు. ఆ తర్వాత ఎవరికైనా ఓటు హక్కు రాకపోతే వారి నుంచి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని అన్నారు. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు వాటిని పరిశీలించి క్లియర్ చేస్తారని అన్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ముద్రిస్తారని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. ఈ ఓటరు సవరణ జాబితా కోసం చేపట్టిన సర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎవరైనా ఓటు హక్కు ఇప్పటి వరకు నమోదు చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, డీపీఆర్వో ప్రేమలతతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story