మాజీ క్రికెటర్ మామ, బంధువులు అరెస్ట్

by Muthe.Rajitha |

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత TMC ఎంపీ యూసఫ్ పఠాన్ మామగారితో సహా మరో ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ క్రికెటర్ మామ, బంధువులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ మామగారితో సహా మరో ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుపై వెళ్తున్న కారు వల్ల నీళ్లు చిందాయనే చిన్న కారణం ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గొడవలో బాధితులపై భౌతిక దాడికి పాల్పడినందుకు గానూ ఈ అరెస్టులు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. యూసఫ్ ఖాన్ (30) అనే వ్యక్తి తన కారులో బైకుల్లా ప్రాంతం గుండా వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న నీటి మడుగులోకి కారు వెళ్లడంతో నీరు చింది పక్కనే ఉన్న షోయబ్ ఖాన్ అనే వ్యక్తిపై పడింది. జరిగిన దానికి యూసఫ్ ఖాన్ వెంటనే కారు ఆపి క్షమాపణ కోరినప్పటికీ, షోయబ్ ఖాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే సమీపంలోని వెదురు కర్రతో యూసఫ్ ఖాన్ కారు విండ్‌షీల్డ్‌ను పగులగొట్టి, అతనిపై దాడికి దిగాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు యూసఫ్ ఖాన్ తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, మార్గమధ్యలో యూసఫ్ పఠాన్ మామ ఖలీద్ ఖాన్, అతని కుమారుడు ఉమర్షాద్ ఖాన్, షోయబ్ ఖాన్, షెహబాజ్ పఠాన్ కలిసి బాధితులపై మరోసారి విరుచుకుపడ్డారు. వెదురు కర్రలు మరియు బేస్‌బాల్ బ్యాట్లతో చేసిన ఈ దాడిలో యూసఫ్ ఖాన్ బంధువులు తీవ్రంగా గాయపడ్డారు.

ముగ్గురు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బైకుల్లా పోలీసులు ఘటనా స్థలంలోని CCTV ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఖలీద్ ఖాన్, ఉమర్షాద్ ఖాన్, షోయబ్ ఖాన్‌లను అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి మే 2 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న షెహబాజ్ పఠాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story