ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర అనారోగ్యం.. కపిల్ దేవ్, గవాస్కర్ రిక్వెస్ట్

by Muthe.Rajitha |

పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంపై భారత మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి లెటర్ రాశారు.

ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర అనారోగ్యం.. కపిల్ దేవ్, గవాస్కర్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఫోటో ఒకటి మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ అనారోగ్యంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ కు సరైన వైద్యం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తో పాటు ప్రపంచంలోని 14 మంది ప్రసిద్ధ మాజీ క్రికెట్ కెప్టెన్లు కలిసి పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఒక ఓపెన్ లెటర్ అందజేశారు. ఈ లేఖలో పాకిస్తాన్ మాజీ ప్రధాని, వరల్డ్ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ కు తీవ్ర అనారోగ్యం

73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి రావల్పిండి లోని అడియాలా జైలులో అనేక కేసులపై శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవలి రిపోర్టుల ప్రకారం.. ఆయన కుడి కంట దృష్టి పూర్తిగా తగ్గిపోయిందని సమాచారం. అక్టోబర్ నుంచి బ్లర్ విజన్, హేజీ విజన్ సమస్యలు మొదలయ్యాయి. జనవరి చివర్లో కంటిలో బ్లడ్ క్లాట్ తొలగించేందుకు శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ అనంతరం సరైన వైద్యం అందడం లేదని ఆయన కుటుంబం, పార్టీ (PTI) ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది తన రిపోర్టులో కుడి కంటిలో దృష్టి పూర్తిగా పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ బోర్డు మాత్రం పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది. కాగా ఇమ్రాన్ అనారోగ్యంపై పాక్ సుప్రీంబోర్డు మరోసారి స్పందించి.. తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేయగా.. ప్రత్యేక వైద్య బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పాక్ కు మాజీ కెప్టెన్ల లేఖ

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, భారత్ తదితర దేశాల మాజీ కెప్టెన్లు గ్రెగ్ చాపెల్ నేతృత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంతకాలతో కూడిన లేఖ అందించారు. సంతకం చేసిన వారిలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, క్లైవ్ లాయిడ్, డేవిడ్ గవర్, నాసర్ హుస్సేన్, మైక్ బ్రియర్లీ, జాన్ రైట్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూజెస్ వంటి ప్రముఖులు ఉన్నారు.

లేఖలో ఏముంది?

కాగా ఈ లేఖలో ప్రధానంగా నాలుగు అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ముఖ్యంగా దృష్టి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఆయనకు తక్షణమే ఎంపిక చేసిన స్పెషలిస్ట్ వైద్యులతో చికిత్స కల్పించాలని డిమాండ్ చేసారు. అలాగే దేశ మాజీ ప్రధాని, దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన మాజీ కెప్టెన్ కు ఇవ్వాల్సిన గౌరవంతో, మానవ హక్కులను కాపాడుతూ వ్యవహరించాలనే విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆయన జైలు పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేసారు. ఇమ్రాన్ ను ఒంటరి గదిలో కాకుండా.. ఒక రాజకీయ ఖైదీగా చూడాలని, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతివ్వాలని విన్నవించారు. అయితే భారత్ - పాకిస్తాన్ మధ్య సయోధ్య లేకపోయినా.. ఇది రెండు దేశాల మధ్య వ్యవహారంలా కాకుండా క్రికెట్ ప్రపంచానికి చెందిన ఒక గొప్ప వ్యక్తికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడమేనని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story