ఉప్పల్‌లో మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

by Ratna Kumari |

ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆహార భద్రత విభాగం అధికారులు బుధవారం ఉప్పల్ మెట్రో సమీపంలోని మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్‌లో ఆకస్మిక సంయుక్త తనిఖీలు నిర్వహించారు.

ఉప్పల్‌లో మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
X

దిశ, ఉప్పల్ : ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆహార భద్రత విభాగం అధికారులు బుధవారం ఉప్పల్ మెట్రో సమీపంలోని మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్‌లో ఆకస్మిక సంయుక్త తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు రెస్టారెంట్ యాజమాన్యంపై రూ.25,000 జరిమానా విధించారు. అలాగే అధికారిక నోటీసు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో స్టోర్‌రూమ్, డైనింగ్ ఏరియాలో ఈగలు, బొద్దింకలు అధికంగా ఉండటం, మాంసాహార పదార్థాలను తగిన ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు లేకుండా నిల్వ చేయడం, ఆహారాన్ని మూతలు లేకుండా ఉంచడం, రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత రికార్డులు నిర్వహించకపోవడం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చెత్త బుట్టలకు మూతలు లేకపోవడం, స్టోర్‌రూమ్ అపరిశుభ్రంగా ఉండటం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడం, కొన్ని ఆహార పదార్థాలపై తప్పనిసరి లేబుళ్లు లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆహార భద్రతా నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార వ్యాపార సంస్థలపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 నిబంధనలను తప్పనిసరిగా పాటించి వినియోగదారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.

Next Story