- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీ డెవలప్‌మెంట్‌పై ఫోకస్.. సర్కారు ప్రత్యేక పాలసీ
గ్లోబల్ సిటీల తరహాలో హైదరాబాద్ పాతబస్తీ, వరంగల్ కోట పరిసర ప్రాంతాలను పునరాభివృద్ధి (రీ-డెవలప్‌మెంట్) చేసేందుకు ప్రభుత్వం సరికొత్త పాలసీని సిద్ధం చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ముఖ్యమైన నగరాలైన హైదరాబాద్, వరంగల్ పట్టణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటితోపాటే ఇప్పటికే ఉన్న హైదరాబాద్ కోర్ సిటీ, పాతబస్తీని సైతం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటి కే ప్రణాళిక రహితంగా నిర్మితమైన ప్రాంతాలను ప్రణాళిక బద్ధంగా నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారు.
ఈ రీ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో జనాభా పెరుగుదల, ఆర్థిక పరమైన అంశాలు, ఆధునీకరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను రూపొందించనున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ చుట్టూ ఏరియా, వరంగల్‌లోని ఫోర్ట్ ఏరియా చుట్టు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికలు, ప్రతిపాదనలను సైతం అర్బన్ చాలెంజింగ్ ఫండ్(యూసీఎఫ్)కు పంపించారు. అయితే వరంగల్ నగరానికి ఇప్పటికే యూసీఎఫ్ ఫండ్స్ వచ్చాయి. చార్మినార్ ప్రాంతానికి చెందిన ప్రతిపాదనలకు యూసీఎఫ్ ఆమోదం రావాల్సి ఉంది.
ప్రపంచ నగరాల్లో అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు విభిన్న దృష్టి, ప్రమాణాలతో గణనీయమైన పునరాభివృద్ధి చెందుతున్నాయి. వీటిని అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్‌లోని టోక్యో నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. హాంబర్గ్‌లోని హాఫెన్‌సిటీ ఒక ముఖ్యమైన పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్ట్. దీన్ని ఓడరేవు ఆధారంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. చైనాలోని చాంగ్‌కింగ్ పట్టణం వేగవంతమైన జనాభా పెరుగుదల ఆధారంగా అభివృద్ధి చేశారు. సింగపూర్‌లోని ఫారెస్ట్ సిటీని అభివృద్ధి చేశారు.
హైదరాబాద్‌పై ఫోకస్
హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాలయ కల్పన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, ఆధునీకరణ వంటి అంశాల ఆధారంగా రీ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ సిటీ లో జనాభా పెరిగిపోయింది. దీంతోపాటు నగరం ప్యాక్ అయింది. కొత్తగా హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేదు. పైగా హైదరాబాద్ అంటే ఒకప్పుడు సికింద్రాబాద్, పాతబస్తీ చెప్పుకునేవారు. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్ ఒక్క మాటలో చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని ప్రాంతాల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని రీ డెవలప్‌మెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మురికివాడలను అభివృద్ధి, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, కమర్షియల్ ఏరియాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాల అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చార్మినార్ చుట్టూ ప్రాంతాల్లో..
పాతబస్తీలోనూ మెట్రో రైలు ప్రాజెక్టు వేగంగా జరుగుతున్నాయి. మెట్రో రైలు పూర్తయితే పాతబస్తీలో అభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు రీ డెవలప్‌మెంట్ ప్రణాళికలో భాగంగా చార్మినార్ చుట్టూ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పేరుతో చేపట్టిన పనులు ఏండ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరుగుతూనే ఉంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీప ప్రాంతం తరహాలో చార్మినార్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్, గుల్జార్ హౌస్, మక్కా మసీదు, సర్దార్ మహాల్ వంటి హెరిటేజ్ బిల్డింగ్స్‌తోపాటు రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ పూర్తిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు చార్మినార్ చుట్టూ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల్లో ప్రభుత్వం సడలింపు సైతం ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
వరంగల్ ఫోర్ట్ చుట్టూ..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ ఫోర్ట్ ఏరియా చుట్టూ ప్రాంతాలను రీ డెవలప్‌మెంట్ ప్రణాళికలో భాగంగానే అభివృద్ధి చేయనున్నారు. ఫోర్ట్ ఏరియా తో పాటు భద్రకాళి టెంపుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లను సైతం అభివృద్ధి చేయనున్నారు. అయితే ఇప్పటికే వరంగల్ నగరానికి యూసీఎఫ్ నిధులు రూ.4,674 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే పోర్ట్ చుట్టూ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ కూడా భవన నిర్మాణ అనుమతుల్లో సడలింపు ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






