నిబంధనలకు పాతర.. వ్యాపార జాతర

by Ratna Kumari |

పట్టణంలో మటన్ వ్యాపారుల మాయాజాలానికి మాంస ప్రియులు బలైతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలివిడిగా మాంసపు విక్రయాలు జరుగుతున్నారు.

నిబంధనలకు పాతర.. వ్యాపార జాతర
X

దిశ,డోర్నకల్ : పట్టణంలో మటన్ వ్యాపారుల మాయాజాలానికి మాంస ప్రియులు బలైతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలివిడిగా మాంసపు విక్రయాలు జరుగుతున్నారు. అధికారులు సైతం మామూలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.దీంతో వ్యాపారులు ఆడిందే ఆటగా ఆడిందే పాటగా అన్న చందంగా మారింది. నిబంధనల ప్రకారం ముందుగా పశువైద్యాధికారి మేకలు,గొర్రెలను పరీక్షించి ఆరోగ్యంగా ఉందని ధ్రువకరించిన తర్వాతే వధించాల్సి ఉంటుంది.కోసిన మాంసాన్ని పురపాలక శానిటరీ ఇన్స్పెక్టర్ పరిశీలించి ముద్ర వేస్తేనే వ్యాపారులు వినియోగదారులకు విక్రయించుకోవాలి.ఇవేవీ పట్టని మాంసపు వ్యాపారులు డబ్బు సంపాదన ధ్యేయంగా అమ్మకాలు సాగిస్తున్నారు.

నిబంధనలకు పాతర.. మటన్ లో నాణ్యత మటాష్..

బహిరంగ ప్రదేశాల్లో ఈగలు వాలేలా మాంసాన్ని వేలాడదీయడం,వ్యర్థాలను మురుగునీటి కాలువల్లో పారవేయడం జరుగుతోంది.దుకాణాల చుట్టూ కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. వెటర్నరీ,మున్సిపల్ అధికారుల సర్టిఫైడ్ లేకుండానే బలహీనంగా,అనారోగ్యంతో ఉన్న మేకలు,గొర్రెలు వధించి విక్రయించడం పరిపాటిగా మారింది.మటన్ లో నాణ్యత కొరవడుతున్నట్లు వినియోగదారులు గుర్తిస్తున్నారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి విక్రయాలు సాగిస్తున్నారు.అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను గాలికి వదిలేసి, అపరిశుభ్రమైన వాతావరణంలో మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు ..

పట్టణంలోని కొన్ని మాంసపు దుకాణాల్లో రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.అట్టి మాంసం తిని విరోచనాలు,కడుపు నొప్పులు,ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రి పాలైన దాఖలాలు ఉన్నాయి.గతంలో ఓ బాధితుడు తన కుటుంబం అనారోగ్యాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు అప్పటి మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ఇటీవల ఓ మాంసపు దుకాణదారుడు నాణ్యతలేని,నిల్వ మాంసం అమ్ముతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.కఠిన చర్యలు తీసుకోవలసిన అధికారులు వెనకడుగు వేశారు. మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రజా ఆరోగ్యాలే ప్రధానం ..

మాంసపు దుకాణ విక్రయదారులు నిబంధనలకు లోబడి తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలి.అపరిశుభ్రత,నిల్వ చేసిన మాంసం అమ్మకాలు జరిపితే షాపు సీజ్,జరిమానా విధించడం జరుగుతుంది.పరిశుభ్రత,ఆరోగ్యకరమైన మేకలు,గొర్రెలను మాత్రమే వధించి అమ్మకాలు జరుపుకోవాలి.ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు.

-పురపాలక కమిషనర్ నాగరాజు

Next Story