- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్ష బీభత్సం.. ఐదుగురి మృతి
ఏపీలో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ అకాల వర్షాలు భారీ ఆస్తి నష్టంతోపాటు, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు కృష్ణా, ఎన్‌టీఆర్, తూర్పు గోదావరి వంటి కోస్తాంధ్ర జిల్లాలపై ఈ తుఫాను లాగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వర్ష బీభత్సానికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా కుమ్మరపాలెంలో బైక్‌పై వెళ్తున్న మనోహర్, శివరామకృష్ణ అనే ఇద్దరు యువకులపై భారీ చెట్టు కూలిపడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో ఈదురు గాలులకు విద్యుత్ లైన్ తెగిపడి హోం గార్డ్ మరణించారు. కృష్ణా జిల్లా లంకపల్లిలో తాగునీరు తెచ్చుకోవడానికి బయటకు వెళ్లిన అనిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని, గాలికి తెగిపడి ఉన్న విద్యుత్ తీగను గమనించక దాన్ని తొక్కడంతో అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై మరణించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా వందలాది చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. దీనివల్ల కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాలు గంటల తరబడి చీకట్లోనే ఉండిపోయాయి. విజయవాడ, పరిసర నగరాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మరోవైపు, రాయలసీమలోని అనంతపురం జిల్లాలో వర్షం, గాలి వాన కారణంగా బొప్పాయి, మామిడి వంటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులకు దాదాపు రూ. 5 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వర్షం ముప్పు ఇంకా తప్పిపోలేదని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.






