- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మన్‌పల్లి గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురిపై దాడి
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని తుమ్మన్‌పల్లి గ్రామంలో పిచ్చికుక్క ప్రజలపై విరుచుకుపడింది.

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని తుమ్మన్‌పల్లి గ్రామంలో పిచ్చికుక్క ప్రజలపై విరుచుకుపడింది. ఒక్కసారిగా నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారిలో గ్రామానికి చెందిన రిజ్వానా బేగం, చంటయ్య, యేసయ్య, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. శనివారం సాయంత్రం బొజ్జ నాయక్ తండాకు చెందిన విశాల్ అనే యువకుడి పై దాడి చేయగా ఈరోజు ఆదివారం ఉదయం గ్రామంలో సంచరిస్తున్న పిచ్చికుక్క అకస్మాత్తుగా వారిపై దాడి చేయడంతో ముక్కు, నోరు, చేతులు తదితర భాగాల్లో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులను ఝరాసంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి రిఫర్ చేశారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఝరాసంగం మండలంలో పిచ్చికుక్కల దాడులు షరా మామూలుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బర్దిపూర్, ఝరాసంగం, బొజ్జ నాయక్ తండా, కుప్పానగర్ తదితర గ్రామాల్లో కూడా కుక్కల దాడులు జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సంచరిస్తున్న వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక వైద్యాధికారిణి రమ్య ప్రజలకు సూచించారు.






