అలుగునూరు బ్రిడ్జిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం

by Muthe.Rajitha |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూర్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

అలుగునూరు బ్రిడ్జిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూర్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటాఏస్ వాహనం ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన 12 మంది వలస కార్మికులు కరీంనగర్ జిల్లా కటికేనపల్లిలో నివాసముంటూ హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం వీరంతా కూలి పనుల నిమిత్తం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని బుధవారం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో తిరిగి కటికేనపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వాహనం అలుగునూర్ వంతెనపైకి రాగానే, డ్రైవర్ అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టాడు.

ప్రమాద తీవ్రతకు టాటాఏస్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో ప్రయాణిస్తున్న 12 మందిలో ఒకరు క్యాబిన్ మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 11 మందికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story