ప్రాజెక్టులను బహిష్కరించాలి.. కట్టిన ప్రాజెక్టుల్లో రైతులకు భూములకు భూములే ఇవ్వాలి

by Batti.Sumithra |

రాష్ట్రంలో నూతన భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని బహిష్కరించాలని, ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల వల్ల భూ నిర్వాసితులైన రైతులకు భూములకు భూములే ఇవ్వాలని ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టులను బహిష్కరించాలి.. కట్టిన ప్రాజెక్టుల్లో రైతులకు భూములకు భూములే ఇవ్వాలి
X

దిశ, రేవల్లి : రాష్ట్రంలో నూతన భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని బహిష్కరించాలని, ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల వల్ల భూ నిర్వాసితులైన రైతులకు భూములకు భూములే ఇవ్వాలని ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో ఓం శ్రీ సాయి ఫైనాన్స్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన బాధితుల సమస్యల పరిష్కార సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి భూములకు భూములే ఇవ్వాలని, చాలని డబ్బులు ఇచ్చి పాలకులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. దీనివల్ల ఎంతోమంది నిరాశ్రయులై, పరిహారంగా వచ్చిన డబ్బులతో భూములు కొనలేక వృథా చేసుకుని నిర్వాసిత కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలాభం కోసం నాసిరకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారని, కట్టిన కొద్దిరోజులకే నాసిరకమైన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు. కావున భారీ ప్రాజెక్టుల నిర్మాణం నిరుపయోగమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల్లో లోపాలు ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అమలులో ప్రజల భద్రత, నిర్వాసితుల పునరావాసం, రైతుల జీవనోపాధి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, వాటి సామాజిక–ఆర్థిక ప్రభావాలపై ప్రభుత్వం నిపుణులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు దీర్ఘకాలికంగా మేలు చేసే విధానాలను అవలంబించాలని సూచించారు.

త్వరలోనే ఫైనాన్స్ బాధితుల చేతికి డబ్బులు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న ఓం శ్రీ సాయి ఫైనాన్స్‌లో పాలమూరు–రంగారెడ్డి భూ నిర్వాసితులు డబ్బులు పెట్టి నష్టపోయిన బాధితులకు త్వరలోనే ప్రభుత్వ పరంగా డబ్బులు అందనున్నట్లు పాశం యాదగిరి తెలిపారు. ఫైనాన్స్ యాజమాన్యం నుంచి అటాచ్ చేసిన ఆస్తులను విక్రయించి వచ్చిన డబ్బును బాధితులకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎంపీ మల్లు రవి సహకారంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించి, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై న్యాయపరమైన కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే సాయి ఫైనాన్స్ నిర్వాహకులపై ప్రభుత్వం, సంబంధిత శాఖలు చట్టపరంగా వేగంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడేరు పర్వతాలు, శ్రీశైలం, పాషా, మల్లేష్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story