- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాత.. అప్రమత్తం!
వానకాలం (ఖరీఫ్) సీజన్ ముంగిట్లోకి వచ్చేసింది. ఆశగా మృగశిర కార్తె వైపు చూస్తూ పొలాలను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతల అవసరాలను, పెట్టుబడి ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు ఇటు నకిలీ వ్యాపారస్తులు, అటు దళారులు తెరవెనుక స్కెచ్ వేస్తున్నారు.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: వానకాలం (ఖరీఫ్) సీజన్ ముంగిట్లోకి వచ్చేసింది. ఆశగా మృగశిర కార్తె వైపు చూస్తూ పొలాలను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతల అవసరాలను, పెట్టుబడి ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు ఇటు నకిలీ వ్యాపారస్తులు, అటు దళారులు తెరవెనుక స్కెచ్ వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విత్తనోత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న గద్వాల, భూత్పూర్ మండలాలను అడ్డాగా చేసుకుని నకిలీ, నాణ్యత లేని పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల నకిలీ బ్యాగులలో నింపి విక్రయించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో రైతాంగం ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూత్పూర్, గద్వాల కేంద్రాలుగా విక్రయాలు..
గత కొన్ని ఏళ్లుగా గద్వాల, భూత్పూర్ ప్రాంతాల్లో పత్తి విత్తనాల ఉత్పత్తి, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్ లో ఇక్కడికి రైతుల తాకిడి ఎక్కువగా ఉండటాన్ని దళారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లు, సంచులను సృష్టించి తక్కువ ధరకే ఇస్తామంటూ రైతులను నమ్మించేందుకు మాయమాటలు చెబుతున్నారు.
అనుమతులు ఉన్న కంపెనీల నుంచి కొనుగోలు చేయాలి..
ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. విత్తనాల రకం, లాట్ నంబర్, మొలకెత్తే శాతం, ప్యాకింగ్ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. లూజ్ గా (కుల్లాగా) అమ్మే ఎలాంటి విత్తనాలను, రంగు పూసిన గింజలను నమ్మి కొనరాదని సూచించారు.
ఆధారాలు భద్రం..
ఒకవేళ కొన్న విత్తనాలు మొలకెత్తకపోయినా, పంట పెరిగాక సరైన దిగుబడి రాకపోయినా రైతులు నష్టపోకుండా న్యాయం పొందాలంటే కొన్ని ఆధారాలు తప్పనిసరి. కొనుగోలు చేసిన సమయంలో డీలర్ సంతకం, దుకాణం ముద్ర ఉన్న క్యాష్ బిల్లును తప్పకుండా అడిగి తీసుకోవాలి. విత్తనాలు నాటేసిన తర్వాత సదరు కంపెనీ ఖాళీ ప్యాకెట్లను, ట్యాగ్‌లను పారేయకుండా పంట చేతికి వచ్చేవరకు భద్రపరుచుకోవాలి. పంట దెబ్బతింటే ఈ ఆధారాల ద్వారానే సదరు డీలరుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, న్యాయస్థానం లేదా వినియోగదారుల ఫోరం ద్వారా పరిహారం పొందేందుకు వీలుంటుంది.
అప్రమత్తంగా లేకుంటే నష్టమే..
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. విత్తనాల కొనుగోలు విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా తక్షణమే స్థానిక ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.






