- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్ల విస్తరణ పనుల పై రైతుల నిరసన.. నష్టపోతున్నామని రైతుల ఆవేదన
రోడ్ల విస్తరణ పనుల పై రైతుల నిరసన.. నష్టపోతున్నామని రైతుల ఆవేదన

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల పరిధిలో ఇటీవల మంజూరైన రహదారి పనుల నేపథ్యంలో స్థానిక రైతుల్లో ఆందోళన నెలకొంది. పంచాయతీరాజ్ తెలంగాణ ప్రత్యేక నిధుల ద్వారా రూ.4.20 కోట్ల వ్యయంతో చౌటపల్లి గ్రామం నుంచి అల్లిపురం వరకు బీటీ రహదారి నిర్మాణం చేపడుతుండగా, రోడ్డు ఎత్తు పెంచేందుకు తమ పట్టా పొలాల్లో లోతైన గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.అదేవిధంగా బక్కమంతులగూడెం,అల్లిపురం మధ్య రూ.3.50 కోట్లతో చేపట్టిన మరో రహదారి పనుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోతున్నారు.రోడ్డు విస్తరణ కోసం పొలాల్లో భారీగా మట్టి తీసుకోవడంతో భవిష్యత్తులో ఆ భూములను తిరిగి సాగుకు అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం చౌటపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రహదారి పనులను అడ్డుకుని నిరసన చేపట్టారు. తమ అనుమతి లేకుండా భూములను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. ఓ పేద రైతు ప్రొక్లైన్ యంత్రంపైకి ఎక్కి,పేద రైతుల భూములను నాశనం చేసే అభివృద్ధి మాకు అవసరం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
రైతుల ప్రకారం,రహదారి అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని,అయితే తమ భూములకు నష్టం కలగకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు.ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేయాలే గానీ,రైతులను ఆర్థికంగా నష్టపరిచే విధంగా ఉండకూడదని గ్రామస్తులు,అభిప్రాయపడుతున్నారు.గ్రామస్తుల ఆందోళనతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.రైతుల సమస్యలను గుర్తించి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని,భూములు కోల్పోయిన వారికి తగిన న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
అధికారుల వివరణ ఇదే
ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ హుజూర్‌నగర్ డీఈపీ కోక్య నాయక్ ను వివరణ కోరగా,పాత నక్షాలు, బాటలు, డొంకల వివరాల ఆధారంగానే రహదారి పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఎంత మేర భూమి ఉందో అంత మేరకే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ ఏ ఒక్క రైతును నష్టపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న నక్షా బాటలను మాత్రమే అనుసరిస్తున్నామని, రైతుల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే,అభివృద్ధి పనులు ప్రజల సహకారంతోనే విజయవంతమవుతాయని, రైతుల సందేహాలు నివృత్తి చేసి పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎంత ముఖ్యమో, రైతుల జీవనాధారమైన భూముల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్నారు.






