- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్డీల ఉచ్చులో కర్షకుడు!
రైతు దేశానికి వెన్నెముక అని వేదికల మీద పొగడ్తలే తప్ప, క్షేత్రస్థాయిలో ఆ వెన్నెముకను విరిచేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టే నాథుడే కరువయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, పెద్దపల్లి: రైతు దేశానికి వెన్నెముక అని వేదికల మీద పొగడ్తలే తప్ప, క్షేత్రస్థాయిలో ఆ వెన్నెముకను విరిచేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టే నాథుడే కరువయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది పెద్దపల్లి జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆరుగాలం కష్టపడి, నెత్తురును చెమటగా మార్చి మట్టిని నమ్ముకున్న రైతు జీవితం కొందరు ఫర్టిలైజర్ దుకాణాల వ్యాపారుల ఖాతా బుక్కుల్లో అప్పుల పద్దుగా మిగిలిపోతోందని రైతులు వాపోతున్నారు. విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు రైతన్న ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నాడన్న ఆరోపణలు జిల్లాలో కోకొల్లలు. అసలుకు వడ్డీ.. వడ్డీకి వడ్డీ.. దానికో చక్రవడ్డీ అంటూ కొందరు వ్యాపారులు పీల్చి పిప్పి చేస్తుంటే రైతన్న బతుకు ఛిద్రమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం..
ఇక్కడి రైతుల అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకున్న కొందరు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అక్రమ దందాలకు తెరలేపారన్న విమర్శలు ఉన్నాయి. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక, సమయం లేక చాలా మంది రైతులు నేరుగా తమకు తెలిసిన ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయిస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అప్పుగా ఇచ్చే కొందరు దుకాణదారులు.. వాస్తవ ధర కంటే పది నుంచి ఇరవై శాతం అదనంగా ఖాతాలో రాసుకుంటున్నారని సమాచారం. ఆ అప్పుకు మళ్లీ నెలకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సకాలంలో వడ్డీ చెల్లించండని బోర్డు..
దుకాణాల ముందు బాహాటంగానే ‘సకాలంలో వడ్డీ చెల్లించండి.. చక్ర వడ్డీ నుంచి తప్పించుకోండి’ అని కొటేషన్లు రాసి పెడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పంట చేతికి రాగానే అప్పు తీరుద్దామని భావించే రైతుకు, ప్రకృతి పగబడితే ఆ ఏడాది అప్పు రెట్టింపు అవుతుంది. కొందరు మందులు అమ్మే వ్యాపారులు ఏటా లాభాలతో అందలం ఎక్కుతుంటే.. పంటలు పండించే రైతు మాత్రం అప్పుల ఊబీలో కూరుకుపోతున్నాడు.
అయోమయంలో అన్నదాత.. నకిలీల భయం..
ఒకవైపు ఆర్థిక భారం కొనసాగుతుంటే, మరోవైపు నకిలీ విత్తనాలు, కల్తీ మందులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయన్న భయం అన్నదాతల్లో నెలకొంది. ఈ ఏడాది అసలే ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం అనుకూలించక, వర్షాలు ముఖం చాటేసి కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనం నాటితే కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. కానీ మార్కెట్‌లో ఏది అసలు కంపెనీ విత్తనమో.. ఏది నకిలీ సీడో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్యాకింగ్‌లు, లేబుల్స్ అచ్చు గుద్దినట్లు అసలైన వాటిని పోలి ఉండటంతో అమాయక రైతులు మోసపోతున్న ఘటనలు అనేకం. నకిలీ విత్తనాలు నాటి, మొలక రాక.. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామాల్లోకి పెద్ద ఎత్తున కల్తీ విత్తనాలను డంప్ చేస్తున్నా, నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
అధికారుల తీరుపై రైతుల అసంతృప్తి.!
ఫర్టిలైజర్ దుకాణాల తీరుపై, నకిలీ విత్తనాల కల్లోలంపై నిఘా ఉంచి, రైతులను కాపాడాల్సిన వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని ఫర్టిలైజర్ షాపుల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా, వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారని, బిల్ బుక్‌లు నిర్వహించడం లేదని రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. కనీసం మండల కేంద్రాల్లో ఉన్న ప్రధాన ఫర్టిలైజర్ దుకాణాల్లో తరచుగా ఆకస్మిక తనిఖీలు చేపడితే వ్యాపారుల్లో కొంత భయం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కానీ కొందరు అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితమై పోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘వరి కొయ్య కాళ్లను కాల్చొద్దు.. నేల సారాన్ని కాపాడండి’ అంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు ముద్రించి.. వాటిని రెవెన్యూ ఆఫీసుల్లోనో, మండల పరిషత్ కార్యాలయాల్లోనో అంటించి తమ బాధ్యత తీరిపోయిందని కొందరు అధికారులు భావిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అవగాహన కల్పించాల్సింది గోడలకు పోస్టర్లు అంటించి కాదు నేరుగా పొలాల్లోకి వెళ్లి అన్నదాతల్లో ధైర్యం నింపాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రైతాంగాన్ని అప్పుల ఊబి నుంచి, అధిక వడ్డీల భారం నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికోసం జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






