రీల్స్ పిచ్చితో దారుణం.. బస్సు టికెట్లు లేవని వృద్ధుడిని కొరియర్ బస్తాలో కుక్కిన ఫ్యామిలీ

by Muthe.Rajitha |

బెంగుళూరులో ఓ ఫ్యామిలీ రీల్స్ కోసం వృద్ధుని ప్రాణాలను పణంగా పెట్టారు.

రీల్స్ పిచ్చితో దారుణం.. బస్సు టికెట్లు లేవని వృద్ధుడిని కొరియర్ బస్తాలో కుక్కిన ఫ్యామిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో చోటుచేసుకున్న ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ కోసం మానవత్వాన్ని మరిచి, ఒక వృద్ధుని ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదన్న చిన్న కారణంతో తమ ఇంట్లోని వృద్ధుడిని ఏకంగా ఒక గోనె బస్తాలో కుక్కి, కదలకుండా కట్టేసి కొరియర్ ఆఫీసుకు తీసుకువచ్చారు. ఆ వృద్ధుడిని ఒక వస్తువులాగా పార్సిల్ చేసి పంపాలని చూసార. అయితే కొరియర్ ఆఫీసులో ఆ బస్తా లోపల ఏదో కదులుతుండటాన్ని గమనించిన సిబ్బంది అనుమానంతో మూట విప్పి చూశారు. లోపల ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఇదేమిటని ఆ కుటుంబాన్ని నిలదీయగా.. "టికెట్లు దొరకకపోతే ఇంతకంటే ఏం చేస్తాం? ఇతడిని పార్సిల్ చేయాల్సిందే" అని మొండిగా వాదించడంతో సిబ్బంది మరోసారి అవాక్కయ్యారు.

పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకొని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, అప్పటివరకు మొండిగా వ్యవహరించిన ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగివచ్చారు. తమ తప్పును తెలుసుకుని పోలీసులకు, అక్కడి సిబ్బందికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ మొత్తం ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. కేవలం రీల్స్ కోసం ఒక వృద్ధుడి ప్రాణాలను పణంగా పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, రీల్స్ మోజులో పడి కన్నవారిని, పెద్దలను కించపరిచేలా, వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించడం నేరమని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story