రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం: కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు!

by Malleboina Mahesh |

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 100కు చేరువవుతుండటంపై రాహుల్ గాంధీ ఆందోళన. ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు తప్పదని, మోదీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యూహం లేదని తీవ్ర విమర్శలు.

రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం: కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు!
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ (Economy of the country) అస్తవ్యస్తంగా మారుతోందని, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 100కు చేరువవుతుండటం ఆందోళనకరమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) విమర్శించారు. పారిశ్రామిక ఇంధన ధరల పెరుగుదల కేవలం గణాంకాలు మాత్రమే కాదని, అవి రాబోయే భారీ ద్రవ్యోల్బణానికి స్పష్టమైన సంకేతాలని హెచ్చరిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వం దీనిని "సాధారణం" అని కొట్టి పారేయవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రూపాయి పతనం వల్ల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరిగి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆర్థిక పరిణామాలు ప్రతి సామాన్య కుటుంబం జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) విశ్లేషించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయని, విదేశీ పెట్టుబడులు (FII) దేశం నుండి వేగంగా వెనక్కి వెళ్లిపోవడం వల్ల స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది కేవలం సమయం కోసమే వేచి చూస్తున్న వ్యవహారమని ఆయన విమర్శించారు.

మోడీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి స్పష్టమైన వ్యూహం గానీ, దిశానిర్దేశం గానీ లేదని, కేవలం మాటలతో కాలం గడుపుతున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. "ప్రభుత్వం ఏం చెబుతోందనేది ప్రశ్న కాదు.. మీ కంచంలో ఏం మిగిలిందనేదే అసలైన ప్రశ్న" అంటూ రాహుల్ తన ట్వీట్ ద్వారా నిలదీశారు. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే సామాన్యుడి బతుకు మరింత భారమవుతుందని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

Next Story