- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. సీట్ల ఎంపికపై ఎయిర్‌లైన్స్ బాదుడుకు బ్రేక్
విమాన ప్రయాణికులపై అధిక ఛార్జీలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : విమాన ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్న ఎయిర్‌లైన్స్ సంస్థల ధోరణికి అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం, విమానయాన నియంత్రణ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విమానయాన సంస్థలు గత కొంతకాలంగా 'వెబ్ చెక్-ఇన్' పేరుతో దాదాపు 60 శాతం సీట్లను 'పెయిడ్ సీట్లు'గా మార్చి, ప్రయాణికుల నుండి భారీగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. విండో సీటు కావాలన్నా, ముందు వరుసలో కూర్చోవాలన్నా అదనంగా రూ. 200 నుండి రూ. 1500 వరకు చెల్లించాల్సి వచ్చేది. అయితే, ఈ అదనపు వసూళ్లపై ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇకపై విమానంలోని మొత్తం సీట్లలో కనీసం 50 శాతం నుండి 60 శాతం వరకు సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రయాణికులపై విమాన ప్రయాణ ఆర్థిక భారం భారీగా తగ్గనుంది.
కొత్త నిబంధనలివే..
కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగానే కేటాయించాలి. ఒకే పీఎన్‌ఆర్ (PNR) తో టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు విమానంలో వేర్వేరు చోట్ల కాకుండా, ఒకే దగ్గర కూర్చునేలా సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా చిన్న పిల్లలతో, వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది. ప్రయాణికులు తమతో పాటు తెచ్చుకునే క్రీడా పరికరాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నిసార్లు దెబ్బతినడం, పోగొట్టుకోవడం వంటి ఘటనలు జరిగేవి. ఇకపై ఎయిర్‌లైన్స్ సంస్థలు వీటిని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత సురక్షితంగా తరలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తమ పెట్స్ వెంట తీసుకెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం విమానయాన సంస్థలు సులభమైన విధానాలను (Policies) తీసుకురావాలి. విమానాలు రద్దు కావడం, ఆకస్మికంగా రద్దు కావడం వంటి సందర్భాల్లో ప్రయాణికులకు రావలసిన రీఫండ్, ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాల గురించి పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ హక్కుల గురించి కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా, విమానయాన సంస్థల వెబ్‌సైట్లు, యాప్‌లు మరియు ఎయిర్‌పోర్టు కౌంటర్ల వద్ద ప్రాంతీయ భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి.






