- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్మపేటలో డ్రైనేజీ ఆక్రమణ
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. కానీ, ఆ చట్టాన్ని అమలు చేసే క్రమంలో చక్రాల కింద నలిగిపోయే పేదల బతుకుల పరిస్థితి ఏమిటి? దమ్మపేట మండల కేంద్రంలో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

దిశ, దమ్మపేట: చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. కానీ, ఆ చట్టాన్ని అమలు చేసే క్రమంలో చక్రాల కింద నలిగిపోయే పేదల బతుకుల పరిస్థితి ఏమిటి? దమ్మపేట మండల కేంద్రంలో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పారిశుధ్య నిర్వహణ కోసం డ్రైనేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలన్న అధికారుల కఠిన నిర్ణయం, మరోవైపు ఉన్న పళంగా ఉపాధి కోల్పోతే కుటుంబాలు పస్తులు ఉండాల్సిందేనని కన్నీరుమున్నీరవుతున్న చిరువ్యాపారుల దీనస్థితి కనిపిస్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న క్షేత్రస్థాయి వాస్తవాలపై దిశ ప్రత్యేక కథనం.
'తొలగింపు' ఎందుకు అనివార్యమైంది?
క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, దమ్మపేట గ్రామ పంచాయతీ అధికారుల నిర్ణయం వెనుక ఉన్న బలమైన, వాస్తవిక కారణాలు స్పష్టమవుతాయి. దమ్మపేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీల పై ఎన్నో ఏండ్లుగా దుకాణాలు వెలిశాయి. దీంతో డ్రైనేజీల ప్రక్షాళన అసాధ్యంగా మారి, మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో పూడికతీత పనులు చేపట్టకపోతే, మురుగునీరు రోడ్లెక్కి గ్రామమంతా అంటురోగాలు ప్రబలే తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. జూన్ 14వ తేదీ లోపు వ్యాపారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ అధికారులు గ్రామస్తులకు స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. ఇది పూర్తిగా వారి విధి నిర్వహణలో భాగమేనని, ఇందులో అధికారుల స్వార్థం ఏమీ లేదని అర్థమవుతోంది.
రోడ్డున పడుతున్న బతుకు చిత్రాలు
డ్రైనేజీల పై వ్యాపారాలు చేస్తున్నది కోట్లు గడించే బడా బాబులు కారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూరగాయల వ్యాపారులు, పండ్ల బండి వారు, పూల కొట్లు, చిన్నపాటి టీ కొట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు. అకస్మాత్తుగా విధించిన జూన్ 14 డెడ్‌లైన్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉన్నపళంగా దుకాణాలు తొలగిస్తే పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇంటి అద్దెలు ఎలా ఇవ్వాలి అన్నది వారి ఆవేదన. డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించడం తమ తప్పే అయినప్పటికీ.. దశాబ్దాలుగా ఉన్న తమ బతుకుదెరువును అకస్మాత్తుగా లాగేసుకుంటే ఎలా అని వారు వేస్తున్న ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు.






