- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలగడప, గూడూరులో భూదందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?
మిర్యాలగూడ మండలంలో 9 ఎకరాల అటవీ భూమి కబ్జా! మాజీ ప్రజాప్రతినిధి, విలేకరిపై గ్రామస్తుల ఆరోపణలు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన.. అధికారుల విచారణకు డిమాండ్.

దిశ, మిర్యాలగూడ రూరల్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప, గూడూరు గ్రామాల శివారులో ప్రభుత్వ మరియు అడవి భూములపై భారీ స్థాయిలో కబ్జా జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సర్వే నెంబర్ 629 (ఆలగడప), సర్వే నెంబర్ 88 (గూడూరు)లో కలిపి సుమారు 9 ఎకరాలకు పైగా భూమిని ఒక మాజీ ప్రజా ప్రతినిధి, మరో మాజీ విలేకరి కలిసి ఆక్రమించినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా అక్రమంగా భూమిని సమతలీకరించి, సరిహద్దులు మార్చి వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అటవీ, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.
పర్యావరణానికి ముప్పు..
అడవి భూములను కబ్జా చేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెట్లను నరికి సాగు భూమిగా మార్చడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులు ప్రభావశీలురు కావడంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే మౌనం వహించడం వెనుక భారీగా ముడుపులు అందాయనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో కబ్జాలను అడ్డుకున్న అధికారులు, ఇప్పుడు వారికే సహకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
విచారణ జరిపి పేదలకు పంచాలి..
ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని, భూమి లేని పేదలకు పంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు, ఫోటోలు సమర్పించినా ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో కబ్జాదారులు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని పారదర్శక విచారణ జరిపించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్ వివరణ
అటవీ భూముల కబ్జా ఆరోపణలపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్‌ను ‘దిశ’ వివరణ కోరగా, తమ కార్యాలయానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూముల పరిరక్షణకు తమ శాఖ కట్టుబడి ఉందని, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మీడియా సమాచారం కంటే అధికారిక ఫిర్యాదులు అందితేనే త్వరగా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.






