జహీరాబాద్ లో నాలాల ఆక్రమణ

by Muthe.Rajitha |

జహీరాబాద్ లో యధేచ్చగా నాలాల ఆక్రమణ సాగుతోంది. ఆక్రమణలతో వర్షాకాలంలో పట్టణం జలమయం అవుతోందని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్ లో నాలాల ఆక్రమణ
X

దిశ, జహీరాబాద్: అధికార దర్పం.. అధికారుల అవినీతి.. వెరసి జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో నాలాల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. అడ్డూ అదుపులేని ఆక్రమణలతో బఫర్ జోన్‌లు కనుమరుగవుతున్నాయి. కాసుల కక్కుర్తితో రియల్టర్లు గీస్తున్న మ్యాపుల్లో నాలాలు కనుమరుగవుతుంటే, వర్షాకాలంలో సామాన్య జనం కన్నీటి సుడిగుండంలో మునిగిపోతున్నారు. కబ్జా కోరల్లో దోబీనాల.. గోవింద్‌పూర్ గ్రామం నుంచి జహీరాబాద్ మున్సిపాలిటీ మీదుగా పారుతూ నారింజ ప్రాజెక్టులో కలవాల్సిన దోబీ నాల ఇప్పుడు అస్థిత్వాన్ని కోల్పోతోంది. బఫర్ జోన్తో సహా 100 అడుగుల వెడల్పు గల ఈనెల కబ్జాలతో 20 అడుగులకు పరిమితం చేశారు. ప్రధానంగా డ్రీమ్ ఇండియా, ఇంద్రప్రస్థాన్ వంటి వెంచర్ల వద్ద నాలా అడుగడుగునా కబ్జాకు గురైంది. దీని కొనసాగింపుగా మరో రెండు, మూడు వెంచర్లవద్ద నాలా కుచించుకు పోయింది. రియల్టర్లు తమ ప్లాట్ల విస్తీర్ణం పెంచుకోవడానికి నాలా సహజ రూపాన్ని మార్చేయడమే కాకుండా, ప్రవాహ దిశను కూడా మళ్ళిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హౌసింగ్ బోర్డ్, అల్లిపూర్, శాంతినగర్ తదితర ప్రాంతాల గుండా ప్రవహించే నాలాల రూపురేఖలు మారిపోయాయి. పట్టణ ప్రధాన రహదారి వద్ద 30 అడుగుల నాలాలు కుచించకపోయి ఇరుకు సందుల్లో మురుగు నీటి కాల్వలుగా మారాయి.

నీట మునుగుతున్న సొంతింటి కల

రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్ల రూపాయల లాభాలే ధ్యేయంగా సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు. "వర్షాకాలం వస్తే డ్రీమ్ ఇండియా, ఇంద్రప్రస్థాన్ (బైపాస్ రోడ్డు పక్కన) కాలనీలు జలమయమవుతున్నాయి. నాలా ప్రవాహం రోడ్లపైకి చేరి ఇళ్లలోకి నీరు వస్తుండటంతో జనం కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు." నీటిలో మునిగే ప్లాట్లను మాయమాటలతో విక్రయించి, మధ్యతరగతి ప్రజల జీవితకాల సంపాదనను రియల్టర్లు ఆవిరి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, కబ్జాలను ప్రోత్సహిస్తున్న నాయకులు, అధికారులకు రానున్న రోజుల్లో ప్రజాగ్రహం తప్పదని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని హరిస్తే, రేపు సంభవించే విపత్తులకు నేతలు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత నాలాలను కాపాడటంలో పాలకులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్లక్ష్యంగా ఎన్ఓసీలు..

వాగులు, వంకలను కాపాడాల్సిన మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో 'మామూళ్ల' పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నేతల అండదండలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు పొందుతున్నారు. నాలాకు ఇరువైపులా ఉండాల్సిన బఫర్ జోన్లను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ విషయమై సదరు అధికారుల వద్ద ప్రస్తావిస్తే..అలాంటిదేమీ లేదంటూ వారు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు.

Next Story