- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల పైరవీలు.. మంత్రి, సెక్రటరీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల పైరవీలు.. మేడిగడ్డ బాధ్యులకు నో ప్రమోషన్స్.. ఆరోపణలు ఉన్న ఇతరులకు కట్టబెడుతున్నారంటూ అసంతృప్తి!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర నీటిపారుదల శాఖ (ఇరిగేషన్)లో ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు కేటగిరీలో ప్రమోషన్ల వ్యవహారం నడుస్తుండగా.. త్వరలో భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో కొందరు అధికారులు మంత్రి కార్యాలయం, శాఖ కార్యదర్శి కార్యాలయం, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీనియారిటీ, అర్హత, సేవా రికార్డుల కంటే వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ సిఫార్సులు, పైరవీలే కీలకంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. దీంతో చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందనే సమాచారం రావడంతో అనేకమంది అధికారులు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. కొన్నిరోజులుగా సచివాలయంలోని నీటిపారుదల శాఖలో అధికారుల రాకపోకలు అసాధారణంగా పెరిగాయని శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. ఈ ప్రమోషన్ల జాబితాలోనూ పలువురికి అన్యాయం జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
వారికి పదోన్నతులపై అనిశ్చితి..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతుండగా.. నీటి పారుదల శాఖలోని పలువురు అధికారులు సైతం బాధ్యులుగా తేలారు. అయితే.. కొందరి మీద ఏసీబీ దాడులు జరుగగా.. ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో పని చేసిన వారికి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు ప్రభుత్వం ప్రమోషన్లు నిలిపివేసింది. వారందరినీ ప్రమోషన్ల జాబితా నుంచి తొలగించింది. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి, గంధ మల్ల తదితర ప్రాజెక్టుల్లో పనిచేసిన కొందరు అధికారులకు మాత్రం ప్రమోషన్లు లభిస్తున్నాయి. దీంతో ఒకే శాఖలో వేర్వేరు ప్రమాణాలు అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖలో పనిచేసిన ప్రతి అధికారిపై ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేయాలా? లేక ప్రాజెక్టుల వారీగా నిర్ణయాలు తీసుకోవాలా? అనే అంశంపైనా అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాదే ప్రమోషన్... మరోమారు ప్రయత్నం
గతేడాదే కొందరు అధికారులు పదోన్నతులు పొందినప్పటికీ, మరో ఉన్నత పోస్టుకు అర్హత వచ్చిన వెంటనే మళ్లీ ప్రమోషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి పదోన్నతులు సీనియారిటీ, ఖాళీలు, సేవా నిబంధనల ప్రకారం జరగాల్సి ఉన్నప్పటికీ, కొందరు తమకు అనుకూలంగా పోస్టులు సృష్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాఖలో ఏటా ఆగస్టు చివరలో జరిగే డీపీసీ (డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ) మీటింగ్ ఈసారి ఇప్పటికే జరుగగా చాలామంది ప్రమోషన్లు సైతం తీసుకున్నారు. ఉన్నతాధికారుల అండదండలతో మల్లన్నసాగర్, కొండమ్మసాగర్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు సైతం ప్రమోషన్లు వచ్చినట్లు తెలిసింది. గతేడాది ప్రమోషన్లలో భాగంగా ఈఈ టు ఎస్ఈలుగా ప్రమోషన్లు తీసుకున్నారు. వీరితోపాటే ఇంకా చాలామంది అవినీతి ఆరోపణలు ఉన్నవారు డీపీసీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల 16 మందికి ఈఈ నుంచి ఎస్ఈలుగా ప్రమోషన్ కల్పించారు. వీరిలో సుమారుగా ఐదుగురు అధికారులపై అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ వారికి ప్రమోషన్లు కల్పించారన్న వాదన ఉన్నది. అలాగే.. ఎనిమిది మందికి ఎస్ఈ నుంచి సీఈలుగా ప్రమోషన్ ఇవ్వగా వీరిలో ఇద్దరు ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి.
ఫీల్డ్ సర్వీసు ఎక్స్‌పీరియన్స్ లేకున్నా..
కేవలం మంత్రి, సెక్రటరీ నుంచి పైరవీలతోనే వీరంతా ప్రమోషన్లు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇంకా చాలామంది అవినీతి అధికారుల ప్రమోషన్ జాబితా సెక్రటరీ టేబుల్ మీద ఉన్నట్లు తెలిసింది. సెక్రటరీ సంతకం పూర్తికాగానే వారికి ప్రమోషన్ రానున్నట్లు సమాచారం. అయితే.. వీరిలో చాలామందికి ఫీల్డ్ సర్వీసు ఎక్స్‌పీరియన్స్ లేకున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల ఎస్ఈగా ఉన్న ఓ అధికారిపై ఏసీబీ రైడ్ అయింది. ఆయనపై డిపార్ట్‌మెంట్ చార్జ్ సైతం ఉన్నది. అయినప్పటికీ ఆయనకు సీఈగా ప్రమోషన్ కల్పించడం శాఖలో చర్చకు దారితీసింది. ఈ అంశంలో ఈఎన్సీ పైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్ల జాబితాను ఆయన సీరియస్‌గా తీసుకోలేదన్న ప్రచారం జరుగుతున్నది.
జాబితాలో మరో 50 మంది..
ప్రమోషన్ల తంతు ఆగస్టు వరకు కొనసాగనున్నదని తెలుస్తోంది. డీఈ నుంచి ఈఈలుగా ప్రమోషన్లు పొందే వారి జాబితా పెండింగులో ఉన్నది. ఇంకో 50 మంది వరకు డిప్యూటీ ఈఈ నుంచి ఈఈలుగా ప్రమోషన్లు తీసుకునే వారు ఉండగా.. వీరిలో 20 మందికి పైగా గత ఏడాది ప్రమోషన్లు తీసుకున్న వారే ఉన్నారని సమాచారం. ఇప్పుడు వారు సైతం మరోసారి ప్రమోషన్ల కోసం సెక్రెటేరియట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా.. సీఈలుగా ప్రమోషన్ పొందిన 8 మందిలోనూ ఇద్దరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక అధికారిని కాళేశ్వరం విచారణలో భాగంగా నియమించిన ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేసింది. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకున్నా.. ప్రమోషన్ మాత్రం కల్పించారు. అలాగే.. ఓ లేడీ ఆఫీసర్ పైన అలాంటి ఆరోపణలే ఉన్నప్పటికీ ఎస్ఈ నుంచి సీఈగా ప్రమోషన్ కల్పించారు. ఐదు రోజుల క్రితం జగదేవ్‌పూర్ పరిధిలో పనిచేసిన ఓ ఈఈకి ఎస్ఈగా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆఫీసర్లలో అసంతృప్తి..
ప్రమోషన్లలో అవకతవకల నేపథ్యంలో శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సీనియారిటీ, వార్షిక గోప్య నివేదికలు, సేవా రికార్డు, శాఖాపరమైన అర్హతలు, ఖాళీల ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత సిఫార్సులు, పైరవీలకు తావిస్తే శాఖలో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.






