ఎన్‌హెచ్-65 బ్లాక్ స్పాట్లపై డీఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన.. అధికారులకు కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

రోడ్డు ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీసు శాఖ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఎన్‌హెచ్-65 బ్లాక్ స్పాట్లపై డీఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, కోదాడ: రోడ్డు ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీసు శాఖ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శనివారం కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారి–65(ఎన్‌హెచ్-65)పై గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ ఎస్‌ఐ యాకూబ్‌తో కలిసి ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్న ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.

పరిశీలనలో భాగంగా తెలంగాణ చౌరస్తా, ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలోని బ్లాక్ స్పాట్లను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధ్యయనం చేస్తూ, రహదారి నిర్మాణం, వాహనాల రాకపోకలు, మలుపులు, సైన్‌బోర్డులు, వేగ నియంత్రణ వంటి అంశాలపై క్షుణ్ణంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణమే అవసరమైన రక్షణ, నివారణ చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ నియంత్రణ చర్యలు, రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా, రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు శాఖ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని డీఎస్పీ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, హెల్మెట్, సీటుబెల్ట్ వంటి భద్రతా నియమాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. పోలీసు శాఖ చేపడుతున్న రహదారి భద్రతా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Next Story