కామారెడ్డి కాంగ్రెస్ ముఖ్యనేతల రాజీ పై సర్వత్రా అనుమానాలు

by Malleboina Mahesh |

కామారెడ్డి కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ - గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య కుదిరిన రాజీ.. పైకి చేతులు కలిపినా గ్రూపు రాజకీయాలపై సర్వత్రా అనుమానాలు!

కామారెడ్డి కాంగ్రెస్ ముఖ్యనేతల రాజీ పై సర్వత్రా అనుమానాలు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి కాంగ్రెస్‌లో ముఖ్య నేతల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. తాజాగా ఇరువురు నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సయోధ్య కుదిర్చింది. దీంతో కమిటీ సమక్షంలో తామంతా కలిసి పనిచేస్తామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే ఈ తాత్కాలిక సయోధ్య తర్వాత కూడా ఇరువురు నేతలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు ప్రత్యక్ష ఆరోపణలు చేసుకున్న నేతలు, వారి అనుచరులు ఇప్పుడు సడన్‌గా కలిసి ప్రచారం చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ రాజీ ఆచరణలోకి వస్తుందా? లేదా? అనేది ఇప్పుడు కామారెడ్డి పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

పరస్పర హెచ్చరికలతో హీటెక్కిన రాజకీయం..

ఈ సయోధ్య కుదరక ముందు ఇరువురి నేతల అనుచరుల మధ్య పరస్పర ఫిర్యాదులు పతాక స్థాయికి చేరాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో దీక్ష చేస్తామని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని షబ్బీర్ అలీ వర్గం గట్టిగా హెచ్చరించింది. మరోవైపు, తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన షబ్బీర్ అలీ వర్గంపై కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సైతం ‘ఖబర్దార్’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అతిగా ప్రవర్తిస్తే సహించేది లేదని, అవసరమైతే రాహుల్ గాంధీ వద్దకు వెళ్తామని హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

రెండు సార్లు విచారణ.. చివరకు రాజీ..

ఈ వివాదాల నేపథ్యంలో రంగంలోకి దిగిన పార్టీ క్రమశిక్షణ కమిటీ తాజాగా ఇరువురు నేతలను పిలిపించి రెండు సార్లు సుదీర్ఘ విచారణ చేపట్టింది. గడ్డం చంద్రశేఖర్ కమిటీని కలిసి తన వివరణ ఇవ్వగా, వివాదాస్పద ఆడియో కాల్‌పై షబ్బీర్ అలీ సైతం కమిటీకి క్లారిటీ ఇచ్చారు. ఆ ఆడియో నకిలీదని, పార్టీని బలహీన పరుస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన వివరించారు. దీంతో ఆదివారం ఇరువురిని కమిటీ మరోసారి కూర్చోబెట్టి పాత విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించింది. కమిటీ ఆదేశాల మేరకు ఇరువురు నేతలు కలిసి నడుస్తామని హామీ ఇచ్చినప్పటికీ, గతంలో పోటాపోటీగా చేసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ బంధం ఎంతకాలం నిలుస్తుందనే చర్చ సాగుతోంది.

Next Story