ధాన్యం ఆన్‌లోడ్​చేయకుండా మిల్లర్ల ఆలస్యం చేయవద్దు: కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర

by Malleboina Mahesh |

తెలంగాణలో 15 రోజుల్లో రబీ ధాన్యం కొనుగోళ్లు షురూ! 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ సిద్ధం. గోనెసంచుల కొరత లేకుండా మిల్లర్లకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ఆదేశాలు.

ధాన్యం ఆన్‌లోడ్​చేయకుండా మిల్లర్ల ఆలస్యం చేయవద్దు: కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈసారి 90 లక్షల మెట్రిక్​టన్నుల వరి సేకరించేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ క్షేత్రస్థాయిలో రవాణా ఏర్పాట్లు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం అన్‌లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేస్తామని రైస్ మిల్లర్లు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సీజన్‌లో ధాన్యం ప్యాకింగ్ అవసరాలను తీర్చడానికి, గోనెసంచుల కేటాయింపులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మిల్లర్ల వద్ద ఇంకా 35 కోట్ల పాత గోనెసంచులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించిన కమిషనర్, రబీ కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా వెంటనే 10 కోట్ల సంచులను జిల్లా మేనేజర్లకు తిరిగి ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించారు.

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలను అధికారులు ఖరారు చేశారని,10 శాతం నూకల మినహాయింపుతో కలుపుకుని, 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుండి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్​) కేటాయింపుకు ఆమోదం తెలిపారు. మిల్లింగ్ పరిశ్రమకు మద్దతుగా, 10 జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అదే సమయంలో, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, ఇతర సమస్యలపై మిల్లర్ల నుంచి కమిషనర్ వినతిపత్రాలను స్వీకరించారు. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మిల్లర్లకు హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగేలా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తోందన్నారు.

Next Story