కొనసాగుతోన్న జీవో నెం.229 లొల్లి.. ముగ్గులేసి నిరసన తెలిపిన వైద్యులు

by Kema Shiva Kumar |

కొనసాగుతోన్న జీవో నెం.229 లొల్లి.. ముగ్గులేసి నిరసన తెలిపిన వైద్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో జీవో 229 చిచ్చురేపింది. మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) స్వరూపాన్ని మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ జీవోతో ఎన్నికల్లో నెగ్గిన వైద్యులకు ఉన్న మెజారిటీ హక్కులు హరించబడే ప్రమాదం ఏర్పడనున్నది. కౌన్సిల్‌ను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను ‘కీలుబొమ్మ’ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్యవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులు తప్పుచేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా ఈ జీవో ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ జీవో పట్ల తమ వ్యతిరేకతను తెలిపేందుకు రాష్ట్రంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జీవో 229 ను వ్యతిరేకిస్తూ సంక్రాంతి ముగ్గులు వేశారు. మరికొన్ని చోట్ల జీవో 229ను వ్యతిరేకిస్తూ సకినాలు కూడా వేసి తమ నిరసన తెలిపారు. మరికొన్ని చోట్ల భోగి మంటల్లో జీవో 229 ప్రతులను తగులబెడుతూ తమ వ్యతిరేకతను వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే మెడికల్ కౌన్సిల్ పై ప్రభుత్వం పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోందని ఇది వైద్య వ్యవస్థకు, రాష్ట్ర ప్రజలకు ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ జీవోను తొలగించే వరకు తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే..?

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వైద్యులదే పైచేయి ఉండేది. కానీ జీవో 229 ప్రకారం కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతంలో ఎన్నికైన సభ్యుల సంఖ్య 13 ఉండగా, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 12గాఉండేది. అంటే మెజారిటీ ఎన్నికైన వారిదే. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచారు. దీంతో మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య 16కు చేరనున్నది. కౌన్సిల్ మొత్తం బలం 29కి పెరిగినా.. అందులో ఎన్నికైన వారు 13 మందే కావడంతో వీరు మైనారిటీ సభ్యులుగా మారిపోతారు. దీంతో కౌన్సిల్ నిర్ణయాలన్నీ ఇక నుంచి మెజరారిటీగా ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న అధికారుల కన్నుసన్నల్లోనే జరిగే అవకాశాలున్నాయని, ఎన్నికైన సభ్యులకు ఎలాంటి విలువ ఉండదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల కౌన్సిల్ ఇకపై స్వతంత్రంగా వ్యవహరించకుండా.. ప్రభుత్వ నిర్ణయాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story