- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల సెంటిమెంట్.. ప్రచారాస్త్రంగా బీఆర్ఎస్ ప్లాన్
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) చూస్తున్నట్లుగా సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) చూస్తున్నట్లుగా సమాచారం. జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెండు రోజుల కిందట ప్రకటన చేయగా.. త్వరలో మున్సిపల్ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపు, తగ్గింపు, పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్నిర్ణయంచినట్టుగా తెలిసింది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లా రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఇదే బిగ్‌టాపిక్‌గా అక్కడి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నట్టు తెలిసింది. దీంతో జిల్లాల సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ చూస్తున్నట్లుగా సమాచారం.
జనగామ, ములుగు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, అసిఫాబాద్, గద్వాల, నారాయణ్‌పేట్, వనపర్తి, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, కొత్తగూడెం, భువనగిరి , సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఇలా ఉమ్మడి జిల్లా కేంద్రాలు మినహా జిల్లాలు రద్దు కాబోతున్నాయని కారు పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఎవరికి వారు ఎక్కడికక్కడ తమ జిల్లాను రద్దు చేస్తే ఉరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా రద్దు ప్రచారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న నాయకులకు మద్దతిస్తున్నట్టు కారు పార్టీ ప్రకటించినట్టు సమాచారం.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లా రద్దు..
తెలంగాణ పోరాటం ద్వారానే కొత్త జిల్లాలు వచ్చాయని, ఇప్పుడు వాటిని ఎలా రద్దు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా వారికి అండగా ఉంటామంటూ ధైర్యం కల్పిస్తూ భరోసానిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాను రద్దు కాకుండా చేసే పోరాటంలో ముందుంటామని చెబుతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ఎన్నికలు ఉండటంతో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబీ నేతలు పక్కా వ్యూహంతో ఉన్నట్లుగా సమాచారం.
ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా, జేఏసీలు, అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీనితో పాటుగా ఈ మున్సిపాలిటిలో కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఆ పార్టీ గెలిచినా జిల్లాల రద్దుకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలను కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నట్టు సమాచారం. అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా జిల్లాలను కాపాడుకోవడం కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల రద్దుకు మేం వ్యతిరేకం..
జిల్లాలు ఏర్పడి దాదాపుగా తొమ్మిదేండ్లు అవుతుందని, ఇప్పటికే భవనాలు కూడా పూర్తి అయ్యాయని, అన్ని జిల్లాల్లో పాలనా సజావుగా సాగుతున్న తరుణంలో జిల్లాలను రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాటి సంఖ్య తగ్గించాలనే ఆలోచనను ప్రజలకు వివరించాలని అందుకు తమ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, కొత్త కలెక్టరేట్కార్యాలయం వచ్చిందని, నవోదయ విద్యాలయం, నర్సింగ్కాలేజీ ఇలా పలు విద్యా వైద్య సంస్థలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
వీటికి తోడుగా జిల్లా కేంద్రంలో భూముల ధరలు, ఇళ్ల ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత వృద్ధి చెందిందని, హఠాత్తుగా వీటిని రద్దు చేస్తే వీటన్నంటిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు జరిగేలోపు ప్రజలందరికీ జిల్లాల రద్దు వలన కలిగే నష్టంపై వివరించాలని గులాబీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ కొత్త జిల్లాల్లో జేఏసీలు సైతం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వారికి మద్దతిచ్చేందుకు బీఆర్ఎస్నేతలు రెడీ అవుతున్నారు.
కొట్లాడి మరీ జిల్లాల సాధన..
ఉమ్మడి ఏపీలో నాటి తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అందరూ మద్దతు ప్రకటించినా.. 33 జిల్లాల ఏర్పాటును మాత్రం కొందరు వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగా ఆయనకు చెప్పే పరిస్థితి లేకపోవడంతో 33 జిల్లాలు కొనసాగాయి. వాస్తవంగా మొదట 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత వాటిని ఏర్పాటు చేశారు. ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలు రాష్ట్రంలో చివరగా ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో పలు జిల్లాలను ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్నారు. ఉద్యమాలు చేసి సాధించుకున్న జిల్లాలను ఏ విధంగా రద్దు చేస్తారని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తున్నది. సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, వికారాబాద్, నాగర్ కర్నూలు లాంటి జిల్లాల డిమాండ్ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి జిల్లాలను ఎలా రద్దు చేస్తారంటూ ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నష్ట నివారణ దిశగా సర్కార్ అడుగులు..
జిల్లా రద్దు అవుతుందనే సెంటిమెంట్‌ను మున్సిపల్‌ఎన్నికల్లో తమకు అనుకూలంగా మరల్చుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు చూస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ సెంటిమెంట్ కొంత వరకు వర్క్అవుతుందని గుర్తించిన గులాబీ నేతలు దీనినే ప్రచార అస్త్రంగా మార్చుకుని ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్నేతల ప్లాన్‌ను ముందే గుర్తించిన కాంగ్రెస్‌నేతలు ఎక్కడిక్కడ నష్ట నివారణ చర్యలను చేపట్టారు. సెంటిమెంట్ బలపడకముందే జిల్లాల రద్దు ప్రచారాన్ని ఎవరికి వారు ఖండిస్తున్నారు. స్థానికులకు భరోసా కల్పిస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండించారు. ములుగు జిల్లా కొనసాగుతుందన్నారు. జనగామ జిల్లా సైతం రద్దు కాదని, తాము కూడా జిల్లా కొనసాగించడానికి పోరాడుతామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ప్రకటించారు. మున్సిపల్ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా అధికార పార్టీ నేతలు అలర్ట్ అవుతున్నారు.






