జిల్లాల పునర్విభజన చిక్కు.. MPTC, ZPTC ఎన్నికలపై అనిశ్చితి!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 03:51:11  IST  )

జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. జిల్లాల హేతుబద్దీకరణపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు.

జిల్లాల పునర్విభజన చిక్కు.. MPTC, ZPTC ఎన్నికలపై అనిశ్చితి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. జిల్లాల హేతుబద్దీకరణపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి పార్టీల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొన్నది. సీఎం ప్రకటనతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా అనే సందేహాలు, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలంటే ఈ ఏడాది చివరినాటికి సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆగుతారా..? లేదంటే ప్రస్తుతమున్న జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తారా..? అనే చర్చ మొదలైంది.

గతంలో ఇలా..

బీఆర్‌ఎస్ హయాంలో​ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అనేక కొత్త మండలాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, కొత్త మండలాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అవి కేవలం రెవెన్యూ మండలాలుగా మాత్రమే కొనసాగాయి. అక్కడ కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. ఎండీపీవో పోస్టును క్రియేట్ చేయలేదు. కార్యాలయాన్ని సైతం ప్రారంభించలేదు. ఆ మండలానికి ప్రత్యేకంగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎవరూ లేరు. ఉమ్మడి మండలానికి ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీలే కొనసాగారు. ఉమ్మడి మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్త మండలాలకు ఎంపీడీవో, స్టాఫ్‌ను, కార్యాలయాన్ని మంజూరు చేశారు. దీంతో అప్పట్లో కొత్త మండలాలు కేవలం రెవెన్యూ మండలాలుగానే మిగిలాయి. ఇక ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు, మండలాలుగానే వారీగానే నిర్వహించాలి. పునర్విభజన అనంతరం సైతం ప్రస్తుతం జరిగిన ఎన్నికల ప్రకారమే జిల్లా పరిషత్‌లు, ఎంపీపీల‌తో పంచాయతీరాజ్​వ్యవస్థ కొనసాగుతుంది. రెవెన్యూ, ఇతర శాఖల్లో మాత్రం మార్పు ఉంటుందని అధికారులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీరాజ్​చట్టం సైతం ఇదే చెబుతుందని గుర్తుచేస్తున్నారు. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత విభజన జరిగినా, విలీనం చేసినా ఐదేండ్ల తర్వాతే అవి అమల్లోకి వస్తాయని చట్టంలో స్పష్టంచేశారు. ఒకసారి పాలకవర్గాలు ఎన్నికయ్యాక వారు ఐదేండ్ల పాటు పాలించాల్సి ఉంటుందని, వారు కోర్టుకు వెళితే వారికే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మరో ఐదేండ్ల వరకు.. ప్రస్తుతమున్న జిల్లాలు, మండలాల ప్రకారమే పాలించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఒక జిల్లాలోనివి మరో జిల్లాలోకి..

పునర్విభజన చేపడితే ఒక జిల్లాలోని మండలాలు మరో జిల్లాలోకి.. ఒక మండలంలోని గ్రామాలు మరో మండలంలో కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పడే ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎన్నికల తర్వాత పునర్విభజన చేపడితే మండలాలు, గ్రామాలు వేరే ప్రాంతంలో కలిసిన పాత పాలకవర్గమే వాటిని పాలించాల్సి ఉంటుంది. కొత్త మార్పులన్నీ ఐదేండ్ల తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల పునర్విభజన ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో విజయవంతం అయ్యే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జిల్లాల సంఖ్యను తగ్గించినా 31 జిల్లా పరిషత్ చైర్మన్‌లు పదవీకాలం ముగిసేవరకు కొనసాగనున్నారు.

READ MORE ....

సికింద్రాబాద్ కార్పొరేషన్ పై రగడ.. పొలిటికల్ క్రెడిట్ కోసమేనా?

Next Story