ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ప్రస్తుత దశ, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
X

దిశ, ఉప్పునుంతల: అచ్చంపేట నియోజకవర్గం విద్యార్థులకు ఆధునిక, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతిష్ఠాత్మక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ప్రస్తుత దశ, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్, మ్యాప్, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగానే పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన నమూనాలో ఎలాంటి మార్పులు చేయకుండా, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న బేస్‌మెంట్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన, పనుల వేగాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు. నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన యంత్రాలు, నిర్మాణ సామగ్రి, కార్మికులను సమకూర్చి పనులను వేగవంతం కొనసాగించాలని, ప్రతి వారం పనుల పురోగతి స్పష్టంగా కనిపించేలా లక్ష్యాలను నిర్దేశించుకుని అమలు చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భవనం చాలా కాలం పాటు విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రతి దశలో ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని హెచ్చరించారు. నిర్మాణానికి వినియోగించే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ తదితర సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ పనులు కొనసాగించాలని నిర్మాణ ప్రాంగణంలో భద్రతా చర్యలను కూడా కచ్చితంగా అమలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులకుఆయన సూచించారు.

ప్రతి దశ పూర్తయిన వెంటనే నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకావాలన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించడంలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, వసతి గృహాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్ తదితర సౌకర్యాలతో కూడిన సమగ్ర విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలనే లక్ష్యంతోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను చేపట్టిందన్నారు.

నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామని, అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో వేగం, నాణ్యత రెండూ సమానంగా ఉండాలని, ప్రజాధనం వృథా కాకుండా ప్రతి రూపాయి ఫలితమిచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు.అనంతరం రాయి చెడు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వెంట ఈడబ్ల్యూఐడిసి ఈఈ , అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, ఉప్పునుంతల తహసీల్దార్ అద్దంకి సునీత,ఇంజనీరింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story