‘పొదుపునకు వీడని గ్రహణం’.. ‘దిశ’ కథనానికి కదిలిన జిల్లా యంత్రాంగం

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-28 04:59:19  IST  )

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని వీవో భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని, పలుచోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని జూలై 22, బుధవారం ‘పొదుపునకు వీడని గ్రహణం’ శీర్షికతో ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు.

‘పొదుపునకు వీడని గ్రహణం’.. ‘దిశ’ కథనానికి కదిలిన జిల్లా యంత్రాంగం
X

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని వీవో భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని, పలుచోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని జూలై 22, బుధవారం ‘పొదుపునకు వీడని గ్రహణం’ శీర్షికతో ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కథనం వెలువడిన అనంతరం సంబంధిత అధికారులు నిర్మాణ పనులపై దృష్టి సారించి, వివిధ గ్రామాల్లో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు.

వనంపల్లి, చిలేమామిడి, బిడకన్నె (రెండు భవనాలు), చిలేపల్లి, మాచ్నూరు గ్రామాల్లో వీవో భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. మరికొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్లతో సమన్వయం చేసి అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలను వేగవంతం చేసే చర్యలు చేపట్టారు. గుంతమర్పల్లి గ్రామంలో భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. వివిధ గ్రామాల్లో నిలిచిపోయిన పనులను త్వరలో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఎక్కడ పనులు నిలిచిపోయాయో అక్కడి పరిస్థితులను పరిశీలించి, పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు పీఆర్ఏఈ శశిధర్ రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన మండల స్థాయి అధికారుల, సర్పంచుల సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ, పొదుపు–రుణాల కార్యకలాపాలకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడనున్న నేపథ్యంలో పనులు తిరిగి ప్రారంభం కావడంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన భవనాల నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘దిశ’ దినపత్రికకు పలువురు మహిళా సంఘాల సభ్యులు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

Next Story