ఆ ఒక్క టూర్‌తో అంత కాలుష్యం.. 'భూమిని చంప‌డంలో' వీళ్ల పాత్ర‌..!

by Disha Web Desk 20 |
ఆ ఒక్క టూర్‌తో అంత కాలుష్యం.. భూమిని చంప‌డంలో వీళ్ల పాత్ర‌..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఒక‌వైపు వాతావ‌ర‌ణ మార్పుతో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కుంటుంటే, మ‌రోవైపు కొంద‌రు త‌మ ఆహ్లాదం, సౌక‌ర్యాల కోసం కాలుష్యాన్ని మ‌రింత పెంచుతున్నారు. ఫ్యాక్ట‌రీల వ్య‌ర్థాలు, ప్లాస్టీక్ వాడ‌కం వంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతుంటే, టూరిజం పేరుతో క‌ర్బ‌న ఉద్గారాలు మ‌రింత‌ కాల్చుకుతింటున్నాయి. ముఖ్యంగా, డిస్నీ ఎలైట్ ప్యాకేజీ ట్రిప్ విడుద‌ల చేస్తున్న‌ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ వాతావ‌ర‌ణంలో భారీగా న‌ష్టాన్ని క‌లుగ‌జేస్తుంద‌ని ఇటీవ‌లి అధ్య‌య‌నంలో బ‌య‌ట‌ప‌డింది. ఈ టూర్‌కి సాధార‌ణ జ‌నం వెళ్ల‌లేరు. ఎందుకంటే, ఇది విఐపి టూర్‌. అందులోనూ, ఒక్కో టికెట్ ధర $110,000, అంటే దాదాపు రూ. 88 ల‌క్ష‌లు. ఇక‌, ఈ టూర్ వ‌ల్ల వాతావ‌ర‌ణంలో క‌ర్బ‌న ఉద్గారాలు ఏ స్థాయిలో విడుల‌వుతున్నాయో తెలిస్తే, గుండె ఆగిపోవాల్సిందే! డేటా ప్ర‌కారం, ఒక్కో అతిథికి 6.2 టన్నుల కార్బన్‌ను విడుదల చేస్తుంది. ఇది తక్కువ-ఆదాయమున్న‌ దేశంలో ఒక సంవత్సరంలో ఒక‌ వ్యక్తి కార్బన్ పాదముద్ర కంటే 20 రెట్లు ఎక్కువన్న‌మాట‌! ఇక‌, ఈ "బకెట్ లిస్ట్ అడ్వెంచర్"లో కేవలం 75 మందికి మాత్రమే వసతి ఉంటుంది. ఈ లెక్క‌న 75 మంది విడుద‌ల చేసే కార్బ‌న్ ఫుట్‌ప్రింట్ ఎంత న‌ష్టాన్ని క‌లిగిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆరు దేశాలు, మూడు ఖండాల్లో విస్తరించి ఉన్న 12 డిస్నీ ప్రాపర్టీలను ఈ టూర్‌లో సందర్శిస్తారు. డిస్నీ ప్యాకేజ్‌ ప్రకారం, ఈ టూర్‌లో కస్టమర్లు "విఐపిల‌కు వినియోగించే" బోయింగ్ 757లో ప్ర‌యాణిస్తారు. ఇక‌, రాబోయే టూర్ జూలై 9, 2023న ప్రారంభం కానుండ‌గా, ప్రయాణీకులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి బయలుదేరుతారు. అక్కడి నుంచి యాంకరేజ్, షాంఘై, హాంకాంగ్, ఆగ్రా, ఈజిప్ట్, ప్యారిస్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో, చివరగా ఓర్లాండో, ఫ్లోరిడాకు వెళ్తారు. ఇప్ప‌టికే ఈ పర్యటనకు టిక్కెట్ల‌న్నీ అమ్ముడుపోయి, హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేశారు. క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ గ్రూప్ ట్రాన్స్‌పోర్ట్ & ఎన్విరాన్‌మెంట్ (T&E) విశ్లేషణ ప్రకారం మొత్తం 19,600-మైళ్లు (31,500-కిమీ) ప్రయాణంలో విమానం నడిపించడానికి ఉపయోగించే జెట్ ఇంధనం మొత్తం 462 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. అంటే, ఒక్కో టూరిస్ట్ 6.2 టన్నుల్ని విడుద‌ల చేస్తున్నారు.

ఇక‌, ప్రపంచ బ్యాంక్ సేకరించిన డేటా ప్రకారం, 2019లో తక్కువ-ఆదాయ దేశంలో ప్రతి వ్యక్తికి సగటు వార్షిక క‌ర్బ‌న‌ ఉద్గారాలు 0.3 టన్నులు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సగటు వార్షిక కార్బన్ పాదముద్ర 4.5 టన్నులు. ఇలా, 2030 నాటికి, భూ తాపంలో 1.5C కంటే తక్కువ ఉండాలనే లక్ష్యాన్ని ప్రపంచం సాధించాలంటే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున 2.3 టన్నుల CO2ను విడుదల చేయాల్సి ఉంటుంది. దీని బ‌ట్టి చూసుకుంటే, ఈ విఐపి టూర్‌లో ప్రతి టిక్కెట్టుకు $109,995 (సుమారు రూ. 88 ల‌క్ష‌లు) ఖరీదు చేసే ఈ పర్యటన, ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాల్లో సింహభాగంలో ఉంది. ఈ ప‌రిస్థితుల్లో స‌ద‌రు 'ధనవంతులు' దీనికి ఎంత‌ బాధ్యత వహిస్తారో ఈ పరిశోధనే సాక్ష్యం అని వాతావరణ కార్యకర్తలు విమ‌ర్శిస్తున్నారు.


Next Story