హిందూ ఆలయాలపై దాడికి CM రేవంతే కారణం: ధర్మపురి అర్వింద్

by Gantepaka Srikanth |

హిందూ సమాజంపై దాడులను సహించేది లేదని.. ఇది తన స్పష్టమైన హెచ్చరిక అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

హిందూ ఆలయాలపై దాడికి CM రేవంతే కారణం: ధర్మపురి అర్వింద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిందూ సమాజంపై దాడులను సహించేది లేదని.. ఇది తన స్పష్టమైన హెచ్చరిక అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలే ఈ దుస్థితికి ప్రధాన కారణమని ఆరోపించారు. ‘కాంగ్రెస్ ఈజ్ ముస్లిం.. ముస్లిం ఈజ్ కాంగ్రెస్’ అని అత్యంత ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. ఈ మాటలతో హిందువులలో కావాలనే భయం సృష్టిస్తున్నారని.. ఆ భయమే రేపు కమ్యూనల్ వయలెన్స్‌కు ట్రిగ్గర్ అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్-ఎంఐఎం కలిసే హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నాయని.. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఇది కాశ్మీర్‌లో 80–90లలో జరిగిన ఎక్సోడస్ తరహా పరిస్థితులకు దారితీసే కుట్ర అని.. ఓల్డ్ సిటీ నుంచి హిందువులను తరిమేయాలన్న దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. పోలీస్ వ్యవస్థ న్యూట్రల్‌గా కాకుండా రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. దాడులు జరిగినా హిందువులనే అరెస్ట్ చేస్తున్నారని.. ఇది పూర్తి అన్యాయమని అన్నారు. 1980–90లోనూ హైదరాబాద్ తీవ్రమైన కమ్యూనల్ టెన్షన్ చూసిందని.. అప్పట్లో కాంగ్రెస్ పాలనలోనే ఘోరమైన అల్లర్లు జరిగాయని చెప్పారు. చెన్నారెడ్డి రాజీనామా చేసిన తర్వాతే అల్లర్లు ఆగాయని తెలిపారు. అప్పట్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు నేరుగా అల్లర్లలో పాల్గొన్నారని.. ఏఎస్పీ సత్తయ్య చర్యలు తీసుకున్నందుకే హత్యకు గురయ్యారని ఆరోపించారు. దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందని.. ఇదే కాంగ్రెస్–ఎంఐఎం చరిత్ర అని పేర్కొన్నారు.

దేవతలపై ఒట్లు వేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక భూలక్ష్మీ మాత ఆలయం, సంతోష్ నగర్, ముత్యాలమ్మ ఆలయం, హనుమాన్ ఆలయం, శంషాబాద్, సోమయ్య చొడమ్మ, పోచమ్మ ఆలయాలు, రామలింగేశ్వర, ఆంజనేయ ఆలయం, గాంధీనగర్, రామాలయం, రాంపల్లి, వెంకటేశ్వర స్వామి ఆలయం, కేపీహెచ్‌బీ, కట్టమైసమ్మ ఆలయం, సఫిల్‌గూడ, మైసమ్మ ఆలయం, పురాణపుల్‌తోపాటు చాలా ఆలయాలపై దాడులు జరిగినట్లు చెప్పారు. ఇవి కేవలం రిపోర్ట్ అయిన ఘటనలే అని.. ఇంకా రిపోర్ట్ కానివి చాలా ఉన్నాయన్నారు. ఈ దాడులన్నింటికీ నైతిక బాధ్యత ముఖ్యమంత్రిదేనని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూ దేవతలపై ఒట్లు వేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని బలిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అయినా, రేవంత్ అయినా విధానం ఒకటేనని.. బీఆర్‌ఎస్ పాలనలోనూ ఇదే ధోరణి చూశామన్నారు. నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చడం తమ ఎజెండా అని.. ఇది రాజకీయ నిర్ణయం కాదని.. చారిత్రక న్యాయమని వెల్లడించారు. బ్రిటిష్ కాలం రైల్వే మ్యాప్స్‌లో కూడా ఇందూరు అనే ఉన్నదని.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ సైతం ఇదే చెబుతున్నదని తెలిపారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుస్తుందని.. మొదటి రిజల్యూషన్ పేరు మార్పుపైనే ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ కాషాయమయం కావడం ఖాయం

తెలంగాణ కాషాయమయం కావడం ఖాయమని.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు. రాముడికి బీజేపీ మెంబర్‌షిప్ ఉన్నదా అన్న వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ముందు కాంగ్రెస్ పార్టీ స్టేట్‌మెంట్లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ముస్లింలకు కూడా సమానంగా సంక్షేమం అందించిందన్నారు. ఆవాస్ యోజనలో కోట్లాది ముస్లింలకు ఇళ్లు ఇచ్చామని.. అభివృద్ధిలో మత భేదం లేదని.. ఇది బీజేపీ విధానమని చెప్పారు. సీఎం మానసిక సమతుల్యతపై సందేహం ఉందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాల వల్లే ఆ పార్టీ పతనమైందని.. కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేవడమే కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు అని అన్నారు. తెలంగాణ భవన్‌లో కూర్చుని డైలాగులు కొట్టొద్దని.. కేటీఆర్‌కు ఇందూరులో పోటీ చేసే ధైర్యం ఉన్నదా అని సవాల్ విసిరారు. తెలంగాణకు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమని చెప్పారు.

Next Story