బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై నిఘా : డీజీపీ సీవీ ఆనంద్‌

by Muthe.Rajitha |

రాష్ట్రంలో బక్రీద్‌ పండుగ వేళ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.

బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై నిఘా : డీజీపీ సీవీ ఆనంద్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పండుగ వేళ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రెండు వర్గాల మధ్య ఘర్షణలకు తావులేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 27న జరిగే బక్రీద్‌ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్‌పోస్టులు...

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే 52 అంతరాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. పశువుల రవాణా విషయంలో చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద ఫిట్ టు ట్రాన్స్‌పోర్టేషన్, ఫిట్ టు స్లాటర్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు..

బక్రీద్‌ పండుగ అత్యంత సున్నితమైనదని, ఈ సమయంలో గోరక్షక బృందాలు గానీ, ఖురేషీలు గానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డీజీపీ స్పష్టం చేశారు. పశువుల రవాణాపై ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప, నేరుగా రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని హెచ్చరించారు. నిబంధనలు మీరి రాద్ధాంతం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెప్పారు. పోలీస్లు రెండు వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అలాగే, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని, గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారి పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

శాఖల మధ్య సమన్వయం..

పండుగ ఏర్పాట్లపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని, చట్టాలను కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సెక్రెటరీ కె. ఇలంబర్తి మాట్లాడుతూ.. పశువుల ధ్రువీకరణ పత్రాల కోసం వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని, సీజ్ చేసిన పశువుల సంరక్షణకు క్యాటిల్ పాండ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, కార్తికేయ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story