అవినీతి ఆఫీసర్ నరహరి రావు మొదటి జీతం@700

by Batti.Sumithra |

తెలంగాణ సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టా ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అవినీతి ఆఫీసర్ నరహరి రావు మొదటి జీతం@700
X

దిశ, సిటీ క్రైమ్ : తెలంగాణ సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టా ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 1987లో నెలకు రూ.700 జీతంతో ఈ విభాగంలో చైన్‌మెన్‌గా ఉద్యోగం ప్రారంభించిన నరహరి రావు, ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు మంగళవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన చైన్‌మెన్ ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించిన నరహరి రావు, అనంతరం డిప్యూటీ డైరెక్టర్ హోదా వరకు ఎదిగారు.

అయితే, 2020 నుంచి 2024 వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన శిక్షణా కేంద్రం తాలీమ్ లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో నరహరి రావుపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కాలంలో రెవెన్యూ శాఖలోని ఆర్‌ఐలు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి పొందేందుకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో కొందరిని ఉత్తీర్ణులు చేసే పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇలా నరహరి రావు తాలీమ్‌లో పనిచేసిన సమయంలో దాదాపు 200 నుంచి 300 మంది ఆర్‌ఐలు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాలీమ్ అధికారిగా ఉన్న సమయంలో భారీ స్థాయిలో లంచాలు స్వీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తాలీమ్‌కు సంబంధించిన ఆరోపణల పై ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. తాజా ఏసీబీ సోదాల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో తాలీమ్ వ్యవహారం పై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Next Story