వరద తగ్గినా.. వీడని బురద

by Batti.Sumithra |

నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టినా, కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రిలో మాత్రం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

వరద తగ్గినా.. వీడని బురద
X

దిశ, కార్వాన్ : నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టినా, కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రిలో మాత్రం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద నీరు తగ్గినప్పటికీ, ఆసుపత్రి ప్రాంగణమంతా బురదతో నిండిపోయింది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో పాటు రాత్రింబవళ్లు సేవలందించే వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం నుండి ఓపీ డిపార్ట్‌మెంట్, రోగులకోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, వార్డులు అత్యవసర విభాగాల వరకు వెళ్లే దారులన్నీ బురదమయంగా మారాయి. తీవ్ర అనారోగ్యంతో వచ్చే వృద్ధులు, చిన్నపిల్లలు ఆ బురదలోనే జారుకుంటూ నడవాల్సి వస్తోంది. నిలిచిన బురద నీటి వల్ల ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర దుర్వాసన వస్తోంది. ఇది దోమల వృద్ధికి కేంద్రంగా మారి, ఆసుపత్రికి వచ్చే వారికి మరిన్ని కొత్త రోగాలు తెచ్చిపెట్టేలా ఉందని రోగులు వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు...

ఈ దారుణ పరిస్థితి పై ఆసుపత్రి వర్గాలు సంబంధిత ఉన్నతాధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి రోగాలు నయం చేసుకోవడానికి వస్తే, ఇక్కడి పరిస్థితి చూస్తుంటే కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయని, రోగులు వారి సహాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య..

ఆసుపత్రి ప్రాంగణంలో సమస్యల పై గత సంవత్సరంతో పాటు, ఈ ఏడాది వేసవి కాలంలోనూ హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు వరుస ఫిర్యాదులు చేశాం. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని డాక్టర్ ఆనంద్ ఆచార్య తెలిపారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రి సిబ్బంది సహాయంతోనే వార్డుల్లో పేరుకుపోయిన బురదను తాత్కాలికంగా తొలగించినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలు సజావుగా సాగాలన్నా, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రం చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు.

Next Story