యువతే దేశ భవిష్యత్తు... మాదక ద్రవ్యాలకు బానిస కాకండి : అదనపు ఎస్పీ రాజేష్ మీనా

by Nallavelli.Anjaneyulu |

నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారిందని క్షణిక ఆనందం కోసం డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు తమ ఆరోగ్యం, విద్య, కుటుంబ బంధాలు నాశనం చేసుకోవద్దని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు.

యువతే దేశ భవిష్యత్తు... మాదక ద్రవ్యాలకు బానిస కాకండి : అదనపు ఎస్పీ రాజేష్ మీనా
X

దిశ, క్రైమ్/ వనపర్తి : నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారిందని క్షణిక ఆనందం కోసం డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు తమ ఆరోగ్యం, విద్య, కుటుంబ బంధాలు నాశనం చేసుకోవద్దని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. యాంటి నార్కోటిక్ బ్యూరో, వనపర్తి పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా ముఖ్య అతిథిగా హాజరై యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వ్యక్తులతో విద్యార్థులకు డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..అత్యంత ప్రమాదకరమైన సమస్యలలో మాదకద్రవ్యాల వ్యసనం ఒకటి. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అతని కుటుంబాన్ని, భవిష్యత్తును, విద్యను,ఉపాధిని,సమాజంలో అతని గౌరవాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది.

మాదక ద్రవ్యాలకు బానిసైన యువత నేరాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థి దశలో ఉన్న యువత చెడు స్నేహాలు, తాత్కాలిక ఆనందాలు, ఒత్తిడి,ఆసక్తి కారణంగా మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి వ్యసనానికి గురైతే దాని నుండి బయటపడటం చాలా కష్టసాధ్యమైన విషయం. మాదకద్రవ్యాలు మనిషి జీవితాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో.. గతంలో గంజాయి తీసుకున్న వ్యక్తుల ద్వారా వారు స్వయంగా అనుభవించిన సంఘటనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ అనుభవాలు ప్రతి విద్యార్థికి ఒక హెచ్చరిక ఒక గుణపాఠంగా నిలవాలి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేవలం పోలీసు శాఖ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయడం ప్రతి పౌరుడి బాధ్యత. విద్యార్థులందరూ విద్య, వృత్తి లక్ష్యాలు, దేశాభివృద్ధిపై దృష్టి సారించి,మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కోరుతున్నాను. ఆరోగ్యవంతమైన యువతతోనే బలమైన సమాజం, అభివృద్ధి చెందిన రాష్ట్రం, శక్తివంతమైన దేశం నిర్మాణం సాధ్యమవుతుంది. "డ్రగ్స్ రహిత వనపర్తి డ్రగ్స్ రహిత తెలంగాణ" సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, ఎస్సై హృషికేష్, నార్గోటిక్ ఎస్సై అంజద్, వనపర్తి జిల్లా డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చెన్నమ్మ తామస్, జిల్లా షీ టీం, భరోసా, ఏహెచ్ టీయూ, నార్కోటిక్, వైద్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Next Story