పబ్‌లపై డీసీపీ రితిరాజ్ మెరుపు దాడులు, యువతులు, విటులు అరెస్ట్!

by Malleboina Mahesh |

కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌లో అమ్మాయిలతో చాటింగ్ చేయించి యువకులను రప్పిస్తున్న వైనాన్ని డీసీపీ రితిరాజ్ బట్టబయలు చేశారు.

పబ్‌లపై డీసీపీ రితిరాజ్ మెరుపు దాడులు, యువతులు, విటులు అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోని ఒక పబ్‌లో గలీజ్ దందాను పోలీసులు బయటపెట్టారు. కూకట్‌పల్లి పరిధిలో గల 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్ (Kings & Queens Pub) లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Ritiraj) ఆధ్వర్యంలో పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు (మెరుపు దాడులు) నిర్వహించారు. ఈ సోదాల్లో పబ్ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న అక్రమ దందా వెలుగుచూసింది.

అమ్మాయిలతో చాటింగ్.. యువకులకు వల

ఈ పబ్ ఓనర్లు కస్టమర్లను, ముఖ్యంగా యువకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అమ్మాయిలతో యువకులకు సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా చాటింగ్ చేయించి, వారిని బుట్టలో వేసుకుని పబ్‌కు రప్పిస్తున్నట్లు నిర్ధారించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టి హంగామా సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పబ్‌లో జరుగుతున్న ఈ గలీజ్ పనులపై స్వయంగా రంగంలోకి దిగిన డీసీపీ రితిరాజ్.. సోదాలు నిర్వహించి పబ్‌లో ఉన్న విటులతో (కస్టమర్లు) పాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పబ్ నడుపుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను పబ్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్‌పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నగరంలో ఇలాంటి అక్రమ పబ్ సంస్కృతి పై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Next Story