- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. తాజాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. నగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ ఇప్పుడు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా అధిగమించింది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో చెన్నై, బెంగళూరు నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండేది, కానీ మౌలిక సదుపాయాల కల్పన పేరుతో జరుగుతున్న పనులు, విపరీతమైన వాహనాల రద్దీ వల్ల హైదరాబాద్ ఇప్పుడు ‘మోస్ట్ పొల్యూటెడ్’ సిటీగా మారుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ప్రకారం, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది.
7 ప్రధాన హాట్‌స్పాట్ల గుర్తింపు..
రాష్ట్రంలో గాలి నాణ్యత పడిపోవడానికి పీసీబీ 7 ప్రధాన హాట్ స్పాట్లను గుర్తించింది. అందులో ముఖ్యంగా సనత్ నగర్ ప్రాంతంలో పారిశ్రామిక పొగ, వ్యర్థాలు, పంజాగుట్టలో నిరంతర వాహనాల రద్దీ, ఉప్పల్‌లో భవన నిర్మాణాలతో వస్తున్న ధూళి, చార్మినార్‌లో వాహనాల నుంచి వచే పొగ, జిడిమెట్లలో రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, ఇక కేపీహెచ్‌బీ, మలక్‌పేట్‌లో హెవీ ట్రాఫిక్, భారీ వాహనాల రకపోకలతో నగరంలో గాలి నాణ్యత పడిపోతుంది.
అనారోగ్యం బారిన పడుతున్న నగరవాసులు
ప్రతి సంవత్సరం నగరంలో లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఫ్లైఓవర్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వల్ల గాలిలో ధూళి కణాలు (Dust particles) పెరిగాయి. మరోవైపు చలికాలంలో గాలి సాంద్రత పెరగడం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉండిపోతున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో నగరవాసులు శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా, అలర్జీలు, కంటి సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత ప్రోత్సహించాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.






