మంటలు ఆర్పే క్రమంలో పేలిన సిలిండర్.. 14 మంది అధికారులకు గాయాలు

by Malleboina Mahesh |

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ పేలి 14 మందికి గాయాలు. బాధితుల్లో ఆరుగురు పోలీస్, ఫైర్ సిబ్బంది.

మంటలు ఆర్పే క్రమంలో పేలిన సిలిండర్.. 14 మంది అధికారులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ అగ్ని ప్రమాదంలోని మంటలను ఆర్పే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 14 మందికి గాయాలు అయ్యాయి. వాయువ్య ఢిల్లీలోని మజ్లిస్ పార్క్ ప్రాంతంలో ఆదివారం ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉండగా ఇంట్లోని ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ పేలుడు ధాటికి సహాయక చర్యల్లో పాల్గొంటున్న ముగ్గురు పోలీసులు, ముగ్గురు అగ్నిమాపక సిబ్బందితో సహా మొత్తం 14 మంది గాయపడ్డారు. భవనంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పలువురు స్థానికులు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story