- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండిపేటలో రాజకీయ నేతల ‘క్రషర్’ దందా
గండిపేట పరిధిలో ఇళ్ల మధ్య నడుస్తున్న స్టోన్ క్రషర్ వల్ల జనాలు ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. నేతల ఒత్తిడితో మున్సిపల్, హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదు.

దిశ, గండిపేట : జనావాసాల మధ్య క్రషర్ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం దుమ్ము ధూళి ఇళ్లలోకి వస్తుందని గగ్గోలు పెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా నుంచి కిస్మత్పూర్ గ్రామానికి వచ్చే రహదారి పక్కనే విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా చాలా కాలంగా క్రషర్ నడుస్తోంది. దాని చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి. ప్రతిరోజు వెలువడే దుమ్ము ధూళితో వృద్ధులు, చిన్నారులు ఇక్కట్లకు గురవుతున్నారు. అదేవిధంగా ఇళ్ల బయట ఆరేసే దుస్తులపైనా కూడా దుమ్ము పడుతుందని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోకరిల్లిన యంత్రాంగం..
ఇళ్ల మధ్యలో ఉన్న క్రషర్ పై చర్యలు తీసుకోవాల్సిన ఆయా విభాగాల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాలు ఇబ్బంది పడితే మాకేంటి అనే ధోరణిలో పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రషర్ వ్యవహారం వెనుకాల అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు వివిధ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రషర్ పై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. క్రషర్ వ్యవహారం స్థానిక మున్సిపల్ అధికారులతో పాటు గండిపేట రెవెన్యూ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులకు కూడా తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రషర్ కు ఎదురుగా వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల కూడా ఉంది. అయినా కూడా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం వెనుకాల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు ఐదు ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్రషర్ తో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఈ క్రషర్ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోలేదు. ఫిర్యాదులను గత మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ప్రస్తుత సర్కిల్ అధికారులు బుట్ట దాఖలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు రెవెన్యూ, హైడ్రా అధికారులు ఇల్ల మధ్యలో నిర్వహిస్తున్న క్రషర్ పై పాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






