- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ బెట్టింగ్ భూతం.. ఈజీ మనీ ఆశతో అప్పుల ఊబిలో యువత
ఐపీఎల్ బెట్టింగ్ మాఫియా గుప్పిట్లో యువత! సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వైనం. భిక్కనూరు సీఐ హెచ్చరిక.

బెట్టింగ్ భూతం యువతను మింగేస్తోంది. కష్టపడి సంపాదించే అలవాటును పక్కన పెట్టి ఈజీ మనీకి ఆశపడ్డ యువత అడ్డదారులు తొక్కుతోంది. అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఐపీఎల్ సీజన్ బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారింది. టాస్ నుంచి చివరి బాల్ వరకూ బెట్టింగ్ సాగుతూనే ఉంటుంది. పోలీసుల నిఘా కొరవడడంతో బెట్టింగ్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని విమర్శలు వస్తున్నాయి. గతంలో బుకీలు తాము ఉండే ప్రాంతంలో టీవీ పెట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఎంత అమౌంట్ పందెం కడుతున్నారో తెలుసుకునేవారు. ఈ సమాచారం తెలిస్తే పోలీసులు దాడి చేసేవారు. పోలీసులు పాతవారిపైనే దృష్టి పెడుతున్నారే తప్ప కొత్తగా బెట్టింగులు నిర్వహించే వారిపై దృష్టి పెట్టకపోవడంతో వారు పోలీసులకు చిక్కకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
దిశ, భిక్కనూరు: ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియా లో చిక్కుకొని... ఎంతోమంది యూత్ భవిష్యత్తును పాడు చేసుకొని.. తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగులుస్తున్నారు. బెట్టింగ్ వలలో చిక్కుకొని, ఆర్థికంగా బలంగా ఉన్న ఉన్నత కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల పుణ్యమా అని, స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఎంతోమంది యువకులు ఈ వ్యసనం బారిన పడి చదువుకు ఎగనామం పెట్టడమే కాకుండా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
జట్ల మధ్య టాస్ మొదలుకొని మ్యాచ్ జరుగుతున్నంత సేపు వేసే ప్రతి బాల్ తో పాటు, ఫోర్, సిక్సర్, వికెట్లు తీయడం వంటి వంటి వాటికి పెద్ద మొత్తంలో ఆన్ లైన్ ద్వారా నలభై రూపాయలు పెట్టుబడులు పెడుతూ మ్యాచ్ ముగిసే వరకు ఫోన్లలోనే తలకాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెట్టింగులు కట్టడానికి దాబా హోటల్లు, టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలను అడ్డాలుగా చేసుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. బెట్టింగ్ ఉచ్చులో పడి ఈ మధ్య చాలామంది తమ కుటుంబాలను బజారుపాలు చేయడమే కాకుండా... ఉన్నత స్థితిలో ఉండి, తలెత్తుకొని బయట తిరగలేని పరిస్థితికి తీసుకొచ్చారు.
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఈ జాడ్యం చాప కింద నీరుల విస్తరించింది. దీంతో ఊహించని ఎన్నో కుటుంబాలు అప్పుల పాలై... రోడ్డున పడుతున్నాయి. కొంతమంది యూత్ మాత్రం జరిగిన నష్టాన్ని, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక, చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక... విలువైన వస్తువుల తో పాటు, ప్లాట్లు, బంగాళాలను తనఖా పెట్టేస్తున్నారు. అయినప్పటికీ అప్పులు తీరే మార్గం లేకపోవడంతో చేసేదేమీ లేక వాటిని విక్రయించడమే కాకుండా, సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
అయినప్పటికీ మరి కొంతమంది అప్పులు తీరకపోవడం ఉద్యోగం చేస్తే వచ్చే నెలసరి వేతనం ఈ ఎం ఐ, ఇన్ స్టాల్ మెంట్లకు సరిపోతుండడంతో కొందరు కుటుంబాలను పోషించుకోలేక సతమతమవుతున్నారు. పైగా వారికి అప్పు నమ్మే పరిస్థితి కూడా లేకపోవడంతో, తలెత్తుకొని బజారులో తిరగలేక మొహం చాటేయాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు.
కోడింగ్ భాషతో..
ఎవరికి అర్థం కాని విధంగా... బెట్టింగ్ రాయుళ్లు కోడింగ్ భాషతో... లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నారు. కేవలం ఈ భాష బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడిన వారికి మాత్రమే అర్థమయ్యేలా.... ఈజీ మెథడ్ ను వాడుతున్నారు. ఈ బెట్టింగ్ ల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న యువకులు, వ్యాపారాలు చేస్తున్న కుటుంబ సభ్యులు ఈ వ్యసనం బారిన పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుని, భార్య పిల్లల్ని అగాధంలోకి నెట్టేస్తున్నారు.
అత్యాశకు పోయి..
తొందరగా.... డబ్బులు సంపాదించాలన్న అత్యాశకు పోయి, క్రికెట్ బెట్టింగ్ లు కడుతూ పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. బెట్టింగ్ లో పెట్టిన పెట్టుబడికి రెండు నుంచి మూడింతల ఆదాయం రావడంతో ఇదే మంచి అవకాశం గా భావించి... పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ బొక్క బోర్ల పడుతున్నారు. ఎంతోమంది యువకులు విద్యార్థులు బెట్టింగ్ లో డబ్బులను పోగొట్టుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు. మరికొందరైతే దొంగతనాలకు అలవాటు పడి జైలు జీవితాన్ని గడుపుతున్న సంఘటనలు ఉన్నాయి. బెట్టింగ్ నివారణకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ, బెట్టింగ్ మాఫియా మాత్రం కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.
బెట్టింగ్ వలలో చిక్కొద్దు...
ఆన్ లైన్ బెట్టింగ్ వలలో చిక్కుకోవద్దని, విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. సర్కిల్ పరిధిలో ఆన్ లైన్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తమకు ఇంతవరకు సమాచారం లేదని, ఎవరైనా సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి, కేసులు నమోదు చేసి బెట్టింగ్ ను అరికడతామన్నారు.:- భిక్కనూరు సీఐ సంపత్ కుమార్






