- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ విద్వేష రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కమ్యూనిజంపై చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమ్యూనిజంపై, ప్రజా పోరాటాలపై చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రాంతీయ విద్వేషాలను, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ పోరాటాలను అవమానించేలా మాట్లాడటం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగదని ఎత్తిచూపారు. తనపై వచ్చిన 10 ఎకరాల చెరువు భూమి ఆక్రమణ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడానికి లేదా ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ కు పూర్తి హక్కు ఉందని, కానీ సీపీఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందంటూ అవాస్తవాలతో బురదజల్లడం కేవలం తనపై వచ్చిన ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని అన్నారు.
కమ్యూనిజం చచ్చిపోయిందనడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానాన్ని, అవివేకాన్ని అద్దంపడుతుందన్నారు. ప్రపంచంలో పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు ఉన్నంత కాలం శ్రామిక వర్గాల తరఫున ఎర్రజెండా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, కేవలం కొన్ని చోట్ల పదవులు లేదా ప్రభుత్వాలు కోల్పోయినంత మాత్రాన సిద్ధాంతం నశించిపోదని స్పష్టం చేశారు. ఈ దేశంలోని దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, కుల, మత, ప్రాంతాలకతీతంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం పోరాడుతున్నవి కమ్యూనిస్టు పార్టీలేనని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ, ప్రధాని మోడీ ఎజెండాకు అనుగుణంగా మతోన్మాద, విద్వేష రాజకీయాలను తెలంగాణలో చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేస్తున్న చర్యలను తెలంగాణ సమాజం ఎన్నటికీ ఆమోదించదని అన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి బాధ్యతారాహిత, విద్వేషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.






