వేసవి వినోదం డిజిటల్ వ్యసనం కాకూడదు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

by Malleboina Mahesh |

వేసవి సెలవుల్లో పిల్లలను స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి రక్షించండి! తల్లిదండ్రుల అప్రమత్తతే బిడ్డల భవిష్యత్తుకు శ్రీరామరక్ష అన్న సీపీ సజ్జనార్.

వేసవి వినోదం డిజిటల్ వ్యసనం కాకూడదు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) పిల్లల తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. వేసవి వినోదం డిజిటల్ వ్యసనం (Digital addiction) కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలుపుతూ.. ఎక్స్ వేదికగా కీలక సందేశాన్ని ఇచ్చారు. అందులో "ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలంతో బాల్యం ఎంతో హాయిగా గడిచేది. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పిల్లల బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమై పోవడం పట్ల సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించ లేకపోవడం వల్లే, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు.

స్మార్ట్ ఫోన్ వాడకం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, అది ఒక వ్యసనంగా మారుతోందని సీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, గంటల తరబడి రీల్స్ చూడటం వంటి వాటికి బానిసలై పిల్లలు నిద్రాహారాలు మానేస్తున్నారని, ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఉజ్వల భవిష్యత్తును పాడు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్‌ లో తరచుగా వెలుగులోకి వస్తుండటం ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అందుకే ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే తల్లిదండ్రుల సమయాన్ని కానుకగా ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ముఖ్యంగా పరీక్షల ఫలితాల సమయంలో వారికి కొండంత భరోసానిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు. పిల్లల ప్రతి కదలికను గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదేనని, వారి అప్రమత్తతే బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

Next Story