బక్రీద్ వేళ ‘ఫేక్ ఫోన్ పే’ ముఠా కలకలం.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్!

by Malleboina Mahesh |

బక్రీద్ సంతల్లో 'ఫేక్ ఫోన్ పే' యాప్‌లతో వ్యాపారులను ముంచుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

బక్రీద్ వేళ ‘ఫేక్ ఫోన్ పే’ ముఠా కలకలం.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్!
X

దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ పండుగ వేళ నగరంలోని వ్యాపారులకు సీపీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారులు, వ్యాపారులతో సందడిగా మారాయి. అయితే, దీనిని అదనుగా తీసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరిట అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా 'ఫేక్ ఫోన్ పే' ('Fake Phone Pay') వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను సృష్టించి, నగదు చెల్లించినట్లుగా స్క్రీన్‌పై నకిలీ రశీదులను చూపిస్తూ వ్యాపారులను నమ్మిస్తున్నారు. సంతలో ఉండే విపరీతమైన హడావుడిని ఆసరాగా చేసుకుని, తమ బ్యాంకు ఖాతాల్లోకి నిజంగానే నగదు జమ అయిందో లేదో సరిచూసుకొని వ్యాపారులకు ఈ కేటుగాళ్లు టోకరా వేస్తున్నట్లు తెలిపారు.

తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ. 68 వేలు, అలాగే రాజేంద్రనగర్‌లో నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను నకిలీ పేమెంట్ యాప్ ద్వారా స్క్రీన్ చూపించి మోసగించి పట్టుకుపోయారు. బాధితులు ఆలస్యంగా తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ తన పోస్టులో తెలిపారు.

ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, వ్యాపారులను హెచ్చరించారు. ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా నగదు పంపినప్పుడు, కేవలం కొనుగోలుదారుడి ఫోన్‌లో కనిపించే స్క్రీన్ షాట్స్‌ను, 'పేమెంట్ సక్సెస్' అనే మెసేజ్‌ను చూసి నమ్మవద్దని ఆయన సూచించారు. మీ స్వంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక ఎస్ఎంఎస్ (SMS) చూసుకోవాలని, నేరుగా మీ బ్యాంకింగ్ యాప్ తెరిచి బ్యాలెన్స్ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలని స్పష్టం చేశారు. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు నగదు రూపంలోనే తీసుకోవడం ఉత్తమమని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, మోసం చేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 'డయల్ 100' కు కాల్ చేయాలని, పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Next Story