- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వ బిల్లుపై సీపీ సజ్జనార్ ప్రశంసల జల్లు
వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డల జీతం నుండి నేరుగా వారికి కొంత భాగం చెందేలా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 'తల్లిదండ్రుల మద్దతు బిల్లు' మానవీయ విలువలకు పట్టం కట్టింది. ఇది దేశానికే దిక్సూచి.

దిశ, వెబ్ డెస్క్: నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీసుకొచ్చిన కొత్త బిల్లు పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన చారిత్రక ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ (Parental Support Bill) పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు.. బిడ్డల బాధ్యతను గుర్తు చేసే ఒక గొప్ప పాఠమని ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సమాజంలో మృగ్యమవుతున్న మానవీయ విలువలు, వృద్ధాప్యంలో కన్నవారిని భారంగా భావిస్తున్న నేటి తరం పోకడలను గుర్తు చేశారు.
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు..
తమ కడుపు కట్టుకొని పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని సజ్జనార్ పేర్కొన్నారు. చిన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి నడిపించిన ఆ చేతులే, వయసు మళ్ళిన తర్వాత రోడ్డు పాలు కావడం సమాజానికి తీరని వేదన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ చట్టు గుర్తుచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీతంలో కోత.. బాధ్యతకు హెచ్చరిక!
వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావడం విప్లవాత్మకమైన నిర్ణయమని ఆయన ప్రశంసించారు. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు ఒక గట్టి హెచ్చరిక అని, తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని సజ్జనార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశానికే దిక్సూచి
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కోరుకునేది విలాసాలు కాదని, కేవలం బిడ్డల తోడు, ప్రేమ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని, ప్రపంచానికే దిక్సూచి అని కొనియాడారు. "తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష" అంటూ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తన సందేశాన్ని ముగించారు.






