వాట్సాప్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే వార్తలపై సీపీ సజ్జనార్ క్లారిటీ

by Malleboina Mahesh |

వాట్సాప్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనేది ఫేక్ వార్త అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు నమ్మొద్దని అలర్ట్.

వాట్సాప్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే వార్తలపై సీపీ సజ్జనార్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా, వాట్సాప్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో సాధారణ ఫోన్ కాల్స్‌తో పాటు వాట్సాప్‌ కాల్స్, మెసేజ్‌లను రికార్డ్ చేస్తోందంటూ ఓ సందేశం వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తూ.. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేయడానికి కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇదని ఆయన కొట్టిపారేశారు. వాట్సాప్ చాట్‌లలో వచ్చే బ్లూ, రెడ్ టిక్స్ నిబంధనలపై వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి తప్పుడు సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

ఇదే విషయమై గతంలో కూడా తాము పలుమార్లు స్పష్టత నిస్తూ ప్రజలను అప్రమత్తం చేశామని, అయినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ ఫేక్ పోస్టర్లను మళ్లీ మళ్లీ షేర్ చేస్తున్నారని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పౌరులుగా సమాజంలో భయాందోళనలు సృష్టించే ఇటువంటి నకిలీ వార్తలను ఎవరూ నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఇటువంటి తప్పుడు, నకిలీ వార్తలను సృష్టించి, వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా నిఘా ఉంచి, వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు.

Next Story