తెలంగాణలో చల్లబడిన వాతావరణం

by Bhoopathi Nagaiah |

బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం

తెలంగాణలో చల్లబడిన వాతావరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం చిరుజల్లులు కురిశాయి. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ రూరల్, అర్బన్, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఆదివారం తరహా వాతావరణమే సోమవారం కూడా కొనసాగుతుందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

అల్పపీడనం కారణంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ఆదివారం మధ్యాహ్నానికి ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతం నుంచి మరఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వైపు వెళ్ళిపోవడంతో తెలంగాణలో వర్షం నామమాత్రంగానే కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గడచిన 24 గంటల్లో గరిష్టంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 13 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకంటే దిగువకు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో గరిష్టంగా శనివారం 40 డిగ్రీలు నమోదుకాగా ఆదివారం మాత్రం జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 39.9 డిగ్రీలు నమోదైంది.

రానున్న రెండు రోజుల్లో మాత్రం వర్షాలు కురవకపోయినా వాతావరణం చల్లగానే ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటకపోవచ్చని, పొడి వాతావరణమే కొనసాగుతుందని పేర్కొన్నది. ఈ నెల 24, 25 తేదీల్లో మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Next Story