'సర్'లో ఉత్తరాది సంప్రదాయం.. పేరు తర్వాత ఇంటిపేరు ఏంటని దక్షిణాదీల విమర్శలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్ వేర్ పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

సర్లో ఉత్తరాది సంప్రదాయం.. పేరు తర్వాత ఇంటిపేరు ఏంటని దక్షిణాదీల విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్ వేర్ పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోనూ భర్తీ చేసే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం, ప్రైవేటు ఉద్యోగాలు, దూర ప్రాంతాల్లో ఉండటం, ఫారాం పూర్తి చేయాల్సిన వివిధ కారణాలతో సొంత గ్రామంలో లేకపోతే ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్​ ఫారాన్ని పూర్తి చేసి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక తిరకాసు పెట్టింది ఎన్నికల సంఘం. ఆన్‌లైన్‌లో పూర్తి చేసేటప్పుడు ఆధార్‌కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆధార్‌కార్డులో మన పేరు, ఇంటి పేరు ఉన్న విధంగానే ఓటరు జాబితాలో పేరు ఉండాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవడానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఓటరు జాబితాలో ఇంటి పేరు చివరన, ఆధార్‌కార్డులో ఇంటిపేరు ముందు ఉంటే ఆ ఎన్యూమరేషన్​ ఫారాన్ని ఆమోదించడంలేదు. అదే సమయంలో ఆధార్ కార్డులో ఇంటి పేరు తరువాత ఉండి, ఓటరు కార్డులో ఇంటి పేరు ముందు ఉంటే కూడా ఎన్యూమరేషన్​ఫారాన్ని ఆమోదించడంలేదు. దీంతో రెండూ ఒకే రకంగా ఉండి ఉంటే కానీ ఎన్యూమరేషన్​ ఫారం ఆమోదించడంలేదు.

ఇంటి పేరే ముందు..

తెలంగాణ సహా దక్షణాది రాష్ట్రాల్లో పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో పేరు తరువాత ఇంటి పేరు ఉంటుంది. ఎన్నికల సంఘం పేరు తరువాత ఇంటి పేరు ఉంటేనే ఆన్‌లైన్‌లోని ఎన్యూమరేషన్ ఫారాన్ని ఓకే చేసే విధంగా రూపొందించారు. దీనితో తెలంగాణ ప్రాంతంతో పాటుగా దక్షణాది రాష్ట్రాలకు చెందిన‌వారు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ప్రయత్నిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని కొందరు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఎందుకు రిజెక్టు అవుతుందో అంటూ ఆందోళన చెందారు. ఆ తరువాత ఇంటి పేరు, అసలు పేరు ముందు వెనకాల ఉండటం కారణంగా గుర్తించారు. దీంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము సొంత గ్రామానికి వెళ్లే ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలా ? అంటూ ఊసురుమంటున్నారు. గ్రామానికి ఇప్పుడు వెళ్లాలంటే ప్రత్యేకంగా ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో అయితే రెండు నిమిషాల్లో అయిపోయే పనిని ఒక రోజంతా వెచ్చించాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇంటి పేరు, అసలు పేరు రెండు ఒకే విధంగా ఉంటే చాలు కానీ ముందు ఉండాలి. వెనకాల ఉండాలనే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఉండే సంస్కృతి, సాంప్రదాయాలును గౌరవించకుండా, తెలుసుకోకుండా ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని చాటే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సోషల్​ మీడియాలో చర్చ జరుగుతుంది. నెటిజన్ల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అనేక అంశాల్లో ఉత్తరాది, దక్షణాది వివక్షపై చర్చ జరుగుతుండగా తాజాగా వచ్చిన ఓటు విషయం‌లో ఈ విధంగా వ్యవహరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యతో రాష్ట్రంలో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే జోక్యం చేసుకొని పేరు, ఇంటి పేరు సరిగా ఉన్నాయా ? లేదా ? అనేది చూడాలి కానీ వెనుక ఉందా? ముందు ఉందా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి అనుగుణంగా వెంటనే సాఫ్ట్‌వేరును మార్చాలని కోరుతున్నారు.

ఇన్షియల్ కూడా సమస్యే..

2002 ఓటరు జాబితాకు ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న పేరు, ఇంటి పేరుకు కూడా అనేక మార్పులు జరిగాయి. అప్పట్లో ఇంటి పేరు మొత్తాన్ని నమోదు చేసుకోకుండా కేవలం ఇన్షియల్‌గా ఏ, బీ, సీ, డీ.. అంటూ తమ ఇంటిపేరు‌ను నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఇంటి పేరు పూర్తిగా ఉంది. దీనితో అప్పటి పేరు‌కు ఇప్పటి పేరుకు మ్యాచ్ కావడం లేదని కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంలేదని గుర్తు చేస్తున్నారు. ఓటరు పేరు కూడా మ్యాపింగ్‌లో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు. ఇలా అప్పటి, ఇప్పటి పేర్లలో వేరు వేరుగా ఉన్నవి 89 లక్షల వరకు ఉన్నాయని గుర్తించారు. దీనితో ఓటర్లలో ఆందోళన నెలకొంది. దీనిపై వారికి అధికారులు సరియైన సమాధానం ఇవ్వకపోవడం, దానికి పరిష్కారం చూపకపోవడంతో టెన్షన్​ పడుతున్నారు. అప్పుడు, ఇప్పుడు పేర్లలో తేడా‌కు కారణాలకు సరైన డాక్యుమెంట్లను చూపిడితే ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.

గ్రామాలకే మొదటి ప్రాధాన్యత...

హైదరాబాద్​, శివారు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు అత్యధికులు తమ సొంత జిల్లా, గ్రామంలోనే ఓటరుగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఏదైనా గుర్తింపు గ్యాస్​ కనెక్షన్‌, బ్యాంకు పాసు పుస్తకం, పాస్‌పోర్ట్​ ఇతరత్రా వాటి కోసమే తీసుకున్నామని చెబుతున్నారు. దీంతో అవిన్నీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓటరు కార్డు ఉన్నా.. లేకున్నా ఒకటేనని చెబుతున్నారు. దీంతో హైదరాబాద్, నగర శివారులో గణనీయంగా ఓటర్లు తగ్గుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తగ్గే ఓటర్ల ప్రభావం ఏ పార్టీపై పడుతుందనే టెన్షన్ నాయకుల్లో మొదలైంది.

Next Story